అమరావతి(చైతన్యరథం): నందమూరి హరికృష్ణ ఆరో వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. హరికృష్ణ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. నిండైన ఆత్మీయత, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం చంద్రబాబు కొనియాడారు.
నాన్న తరువాత హరన్నే: భువనేశ్వరి
హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన సోదరి, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. పుట్టింటిలో నాన్న తర్వాత మాకు హరి అన్నే తమకు పెద్ద దిక్కుగా ఉండేవారన్నారు. ప్రజల హృదయాల్లో హరి అన్న చిరస్మరణీయుడన్నారు.
చిరస్మరణీయం: లోకేష్
హరి మామయ్యా.. మీరు మాకు దూరమైనా జ్ఞాపకమై మా మధ్య జీవించే ఉంటారని మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాలకు హరి మామయ్య అందించిన సేవలు చిరస్మరణీయం అని లోకేష్ అన్నారు.
మరిచిపోలేని సేవలు: బ్రాహ్మణి
మా అందరినీ ప్రేమగా పిలిచే పెదనాన్న హరికృష్ణను ఎప్పటికీ మరువలేమని నారా బ్రాహ్మణి అన్నారు. తాత తరువాత.. నాన్నకి ముందు హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. చిత్ర రంగంలో హరికృష్ణ పెదనాన్న వేసిన పాత్రలు చిరస్మరణీయం అంటూ బ్రాహ్మణి నివాళులర్పించారు.