తెదేపాతోనే మహిళాభ్యున్నతి జరిగిందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ తెలియజేశారు. మహాశక్తి పేరుతో మహిళలకు పెద్దపీఠ వేస్తూ మ్యానిఫెస్టో ప్రకటించడానికి హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం అశోక్ నగర్‌లోని తూర్పు తెదేపా కార్యాలయం వద్ద మహిళా కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత టిడిపికే దక్కుతుందని, ఆ ఆలోచన మొదట ఎన్టీఆర్‌కే వచ్చిందని అన్నారు.
తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల ఏర్పాటు, మహిళలకు భద్రత కల్పించడంతో ఎంతో మంది మహిళలు ఇప్పుడు పురుషులతో సమానంగా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. టిడిపి మేనిఫెస్టో మహిళల అభ్యున్నతికి తోడ్పడేలా ఉందని అన్నారు. మహిళలంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ సైకో ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అనే కసితో ఉన్నారని, వైసీపీకి మహిళలే తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. కొలసాని నాగమణి, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి కాంతిశ్రీ, చెన్నుపాటి ఉషారాణి, తదితర మహిళలు పాల్గొన్నారు.