అమరావతి (చైతన్యరథం): పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతుల కుమార్తె అయిన కృష్ణభారతి జీవితాంతం గాంధేయవాదిగా ఉన్నారని, గాంధీజీ బోధించిన విలువలు పాటించారని చంద్రబాబు నివాళులర్పించారు. ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణభారతి తుదిశ్వాస విడిచారని తెలిసి ఎంతో బాధపడ్డానన్నారు. అట్టడుగు వర్గాల్లో విద్యావ్యాప్తికి ఆమె ఎంతో కృషి చేశారని… విద్యాసంస్థలు, గోశాలలకు విరాళాలు సమకూర్చారని వివరించారు. అలాంటి మహనీయురాలు మన మధ్య లేకుండా పోవడం తీరని లోటు అని చంద్రబాబు పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె కృష్ణభారతి, జీవితాంతం గాందేయవాదిగా ఉంటూ, గాంధీజీ ప్రవచించిన విలువలతోనే జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యావ్యాప్తికి కృషిచేశారు. గోశాలలకు విరాళాలు సమకూర్చారు. అవివాహితగా ఉన్న కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. 2022 జులైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన తీవ్ర ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగురవేసిన ఘటనలో కృష్ణమూర్తి దంపతులకు 1932 జూన్లో కఠిన కారాగారవాసం విధించారు. ఈ ఘటన సౌత్ బార్డోలీ తిరుగుబాటుగా పేరు పొందింది. జైలు శిక్ష విధించిన సమయంలో అంజలక్ష్మి ఆరు నెలల గర్భిణి. అయినా బ్రిటిష్ ప్రభుత్వం కనికరించలేదు. జైలులోనే ఆమెకు కృష్ణభారతి జన్మించారు. కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుడిని, స్వతంత్ర భారతి ఆకాంక్షను గుర్తు చేస్తూ ఆమెకు తల్లిదండ్రులు కృష్ణ భారతి అని పేరు పెట్టారు. ఆమె తొలి 10 నెలల బాల్యం కారాగారంలోనే గడిచింది. పడమర విప్పర్రు గ్రామంలోని తమ మొత్తం ఆస్తిని స్వాతంత్య్ర పోరాటం కోసం కృష్ణమూర్తి దంపతులు త్యాగం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గాంధీజీ పర్యటన సమయంలో కృష్ణమూర్తి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. వినోబాభావే భూదానోద్యమంలోనూ పాలుపంచుకుని స్వగ్రామంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. జీవితాంతం కుష్టు రోగులకు, అభాగ్యులకు సేవ చేశారు. చివరి వరకు గాందేయ విలువలతో జీవించారు.