- వల్లభనేని అనుచరుడిపై గ్రీవెన్స్‌లో బాధితుడి ఫిర్యాదు
- సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలిచ్చిన బాధితులు
- స్వీకరించిన ఎమ్మెల్సీ పంచుమర్తి, మంత్రి మండిపల్లి
అమరావతి (చైతన్య రథం): వైసీపీ హయాంలో సాగిన భూకబ్జాలపై బాధితులు గ్రీవెన్స్‌కు అర్జీలు అందిస్తూనే ఉన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ కావలి గ్రీష్మలు వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన బోకినాల సాంబ శివరావు అర్జీని ఇస్తూ.. వల్లభనేని వంశీ అనుచరుడు తప్పుడు పత్రాలతో భూమిని కబ్జా చేయాలని యత్నిస్తున్నాడని.. దయచేసి అధికారులు తన సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన మైలాపురం చక్రవర్తి విజ్ఞప్తి చేస్తూ.. తనకు గత టీడీపీ ప్రభుత్వంలో టిక్కో ఇళ్లు మంజూరు చేశారని.. అయితే తరుతవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అర్హుల జాబితానుండి తన పేరును తొలగించి అన్యాయం చేశారని, తనకు టిక్కో ఇళ్లు ఇచ్చి న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. కడప జిల్లా రామేశ్వరం గ్రామానికి చెందిన రవణమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తాను అన్ని పర్మిషన్‌లు తీసుకొని బోరువేసుకున్నాక తమ ఊరిలో ఉండే వ్యక్తి కాడె పెద్ద ఓబయ్య తన బోర్ పక్కనే ఎటువంటి అనుమతులు లేకుండా బోర్‌వేసి అక్రంగా కరెంట్ వాడుతున్నాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. అధికారులు అతనివద్ద లంచం తీసుకొని అన్ని అనుమతులు ఉన్న తన బోర్‌ను అక్రమంగా సీజ్ చేశారని దీనిపై అధికారులు విచారించి తనకు న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి వేడుకున్నారు.
పల్నాడు జిల్లా దాడేపల్లి మండలం నడికూడి గ్రామానికి చెందిన పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తూ.. తమ పొలాన్ని జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సేకరించి తమకు రావాల్సిన పరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించాలని అర్జీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 14/2లో ఉన్న తన నాన్నగారి పేరుమీదున్న భూమిని అధికారులు అక్రమంగా మరొకరికి ఆన్‌లైన్ చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారని, దీనిపై విచారణ జరిపి భూమి తమకు దక్కేలా చూడాలని దొడ్డాజు శ్రీనివాసాచారి నేడు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు.
తమ భూమిని పేదల ఇళ్లకు ఇవ్వగా తమకు ప్రభుత్వం మరోచోట భూమి కేటాయిస్తే అందులో సాగు చేసుకుంటుండగా.. పోరుమామిళ్ల ఎమ్మార్వో ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ అనే వ్యక్తి అక్రమంగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని తన తల్లి పేరుమీదకు మార్చుకున్నాడని.. అతనిపై చర్యలు తీసుకొని భూమిని తమకు ఆన్‌లైన్ చేయాలని కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన నడిపి వెంకట సుబ్బయ్య విజ్ఞప్తి చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంకవరం గ్రామానికి చెందిన జి ధనలక్ష్మీ విజ్ఞప్తి చేస్తూ.. తమ స్థలాన్ని వేరొకరు కబ్జా చేస్తున్నారని, దీనిపై అధికారులు సర్వే చేసి తమ స్థలానికి సరిహద్దులు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. దీంతో కబ్జాదారులు తమ స్థలానికి వేసుకున్న కంచెను ధ్వంసం చేసి తమను బెదిరిస్తున్నారని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.