- కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
- విజయవాడ`ఢిల్లీ ఇండిగో సర్వీసు ప్రారంభం
- దుబాయ్, సింగపూర్ సర్వీసులకు కృషి
- విమానాశ్రయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
విజయవాడ(చైతన్యరథం): గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని, విజయవాడ-ఢల్లీి ఇండిగో సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్‌కు సర్వీసులు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నాం. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణెకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నాం. ఏడాదిలోగా గన్నవరం ఎయిర్ పోర్టు కొత్త టెర్మినల్ ప్రారంభిస్తాం. దేశంలో కొత్తగా మరో 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
విస్తరణ పనులు వేగవంతం చేయాలి
విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం విశిష్ట అతిథుల భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు, సాధారణ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇతర అధికారులతో కలిసి విజయవాడ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యత కింద చేపడుతున్నామన్నారు.
2025 జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. విమానాశ్రయ అభివృద్ధి పనులు ఇప్పటి వరకు 52 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిధులు, మెటీరియల్ కొరత లేదని అయినప్పటికీ ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీశారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పనులు కొంతమేర మందగించాయని, వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జరుగుతున్న పనులకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ రూపొందించి దానిలో ప్రతిరోజు జరుగుతున్న పనుల పురోగతిని పోస్ట్ చేస్తూ తనకు వివరించాలని కేంద్ర మంత్రి సూచించారు.
పనులు పూర్తయ్యేంతవరకు నెలకు ఒకసారి క్రమం తప్పకుండా పురోగతిని సమీక్షిస్తామన్నారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాల్వపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గన్నవరం విమానాశ్రయ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ లక్ష్మీ కాంత్ రెడ్డి, గన్నవరం మండలం తహసీల్దార్ శివయ్య, తదితరులు పాల్గొన్నారు.