- వరుస కుంభకోణాలకు సమాధానం చెప్పలేకపోతున్నాం
- అడ్డగోలు పనులు చేస్తూ మమ్నల్ని ఇరికించేస్తున్నారు
- సీనియర్లను విస్మరించి బ్రోకర్లను ప్రోత్సహిస్తున్నారు
- ఆయనను రక్షించడానికి మేం బలిపశువులు కాలేం
- ముఖ్యమంత్రి జగన్ ఎదుట ఉత్తరాంధ్ర నేతల ఆవేదన
విశాఖపట్నం : విశాఖలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒంటెద్దు పోకడలతో చేస్తున్న వరుస కుంభకోణాలపై ప్రజలు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఆయనను సాధ్యమైనంతవరకు విశాఖపట్నం నుంచి బయటకు పంపించే ఏర్పాటుచేయాలని ఉత్తరాంధ్రకు చెందిన పలువురు వైసిపి సీనియర్ మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్ ఎదుట మొరపెట్టుకున్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లిన సిఎం జగన్ పోర్టు గెస్ట్ హౌస్‌లో బసచేశారు. ఉత్తరాంధ్రలో తాజాగా నెలకొన్న పరిణామాలపై సీనియర్ నేతలు రాత్రి ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ఉత్తరాంధ్రలో నెలకొన్న పరిణామాలను పార్టీ సీనియర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి పార్టీ సీనియర్లను పక్కనబెట్టి కొందరు బ్రోకర్లను ఏర్పాటుచేసుకొని వ్యవహారాలు నడిపిస్తున్నారు, అదేమని ప్రశ్నిస్తే మీ పేరు చెబుతున్నారు, అంతా సిఎం ఎరుకలోనే ఉందని చెబుతూ తమకు తలపోటు తెస్తున్నారని వారు వాపోయారు. ఉదాహరణకు తొలుత ఎన్ సిసి భూముల వ్యవహారంలో తలదూర్చారు, తర్వాత దసపల్లా భూములు, తాజాగా రేడియంట్ భూములు, అల్లుడి పేరిట వందలాది ఎకరాల భూముల కొనుగోలు… ఇలా ఒకదాని వెంట ఒకటిగా ఆయన భూదందాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఆరోపణలనుంచి బయటపడేందుకు ఆయన ఇటీవల ఎంపి ఎంవివి సత్యనారాయణను కూడా బురదలోకి లాగారని సిఎం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మీ ఆదేశాలకు లోబడి మేం ఉత్తరాంధ్ర ఉద్యమానికి దిగాం…అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డి కుంభకోణాలు తెరపైకి రావడం వల్ల మేం జనంలోకి వెళ్లలేక పోతున్నాం, పార్టీతో సంబంధం లేని ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకొని ఆయన భూదందాలు కొనసాగిస్తున్నారు, అదేమంటే సిఎం పేరు చెబుతున్నారు, అందులో మీ పాత్ర ఉందో, లేదో మాకు తెలియదు, మేం మాత్రం ప్రజలు, ప్రతిపక్షా లకు సమాధానం చెప్పుకోలేక పోతున్నామని పలు వురు సీనియర్ మంత్రులు ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్న ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని తాము బలిపశువులు కాలేమని సీనియర్ మంత్రి ఒకరు నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ… వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా పంపించాం, విజయసాయితో సమస్య ఉంద ని తెలిసే ఆయనను ఉద్యమానికి దూరంగా ఉండా లని ఆదేశించాం, కొద్దిరోజులు ఓపికపట్టండి, ఆయ నను ఉత్తరాంధ్రలో అడుగుపెట్టకుండా చూస్తానని సీనియర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. సాధ్య మైనంతవరకు తమకు విజయసాయిరెడ్డి తలపోటు వదిలించాలని, ఆయన ఎంత ఎక్కువకాలం విశాఖలో ఉంటే పార్టీ అంత తీవ్రంగా నష్టపోతుందని సీనియర్లు కుండబద్దలుగొట్టినట్లు తెలిసింది. తనపై సీనియర్లు ఫిర్యాదు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న విజయ సాయిరెడ్డి తనపై సీనియర్లలో నెలకొన్న ఆగ్రహాన్ని పసిగట్టి మారుమాట్లకుండా మిన్నకుండిపోయినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి పోర్టు గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పల రాజు, బూడి ముత్యాలనాయుడు, ఎంపి ఎంవివి సత్యనారాయణ, పలువురు మాజీమంత్రులు, సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు.