- లడ్డూ కల్తీ జరిగిందని ఛార్జిషీట్‌లో స్పష్టం
- జరగలేదని చెప్పడానికి సిగ్గుండాలి
- మాకు దేవుడిపై అపారమైన నమ్మకం ఉంది
- జగన్‌రెడ్డి కనీసం డిక్లరేషన్‌పై సంతకం పెట్టడు
- మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ నిప్పులు
అమరావతి(చైతన్యరథం): తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. కల్తీ లడ్డూ విషయంలో వారిని ఆ దేవుడు వదిలిపెట్టడని ధ్వజమెత్తారు. దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం ఉంది..గత పదేళ్లుగా దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నాం..అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నెయ్యి కల్తీ అంశంపై శాసనమండలిలో చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హెరిటేజ్ డెయిరీపై ఆరోపణలు చేశారు. వైసీపీ సభ్యుల ఆరోపణలపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో సభకు రావాలి.. టెండర్‌లో ఎల్-3 వస్తే రాదు.. ఎల్-1 వారికి మాత్రమే వస్తుంది. కామన్ సెన్స్ ఉండాలి. లడ్డూలో కల్తీ అంశం తప్ప వైసీపీ సభ్యులు అన్నీ మాట్లాడతారు. సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో కల్తీ జరిగిందని చాలా స్పష్టంగా చెప్పింది. వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు నెయ్యి మార్కెట్ ధర పెరిగింది. కల్తీ చేసి రూ.300కి నెయ్యి సప్లై చేయమంటారా? వైసీపీ కల్తీ చేసినట్టు చేయమంటారా? అని ప్రశ్నించారు. మార్కెట్ ప్రైస్ ఎంతుందో ఈ రోజు గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు. కావాలని ఆరోపణలు చేస్తున్నా రు. దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం. మాకు రైట్ ఉన్నా తిరుమలలో ఏనాడూ ముఖద్వారం నుంచి వెళ్లలేదు.. క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్లాం. మీ నాయకుడు జగన్‌రెడ్డి డిక్లరేషన్‌పై కనీసం సంతకం కూడా పెట్టలేదు.. మీరా మాట్లాడేది అంటూ నిలదీ శారు. కల్తీ జరగలేదని చెప్పడానికి సిగ్గుండాలి.. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడని మండిపడ్డారు.















