.బట్టలులేకుండా వీడియోలు సిగ్గుచేటు
.మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
అమరావతి: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఒక పార్లమెంటు సభ్యుడు మహిళలతో అసభ్యకరంగా నగ్న వీడియో కాల్స్ చేస్తూ వేధించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల సమస్యల కోసం పని చేయాల్సిన పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మాధవ్ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చన్నారు. రెడ్ హ్యాండెడ్ గా వీడియోతో దొరికిపోయినప్పటికీ, అది మార్ఫింగ్ వీడియో అంటూ తప్పించుకోవాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయినట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాక మాధవ్ ఏ రోజూ ప్రజా సమస్యలపై పోరాడిరదీ లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కేంద్రాన్ని అడిగిందీ లేదని విమర్శించారు. కానీ, తోటి ఎంపీలపై దాడులు చేస్తూ, బూతులు తిడుతూ, పారిశ్రామిక వేత్తల్ని బెదిరిస్తూ అసాంఘిక శక్తిగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ, పాడు పనులు చేసి రాష్ట్రం పరువు తీశాడన్నారు. అలాంటి వ్యక్తికి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై మాధవ్ కోరినట్లుగా కేంద్ర ఫోరెన్సిక్ విభాగంతో దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కళంకితులైన వ్యక్తులు చట్ట సభల్లో కొనసాగడానికి ఎంత మాత్రమూ అర్హత లేదని పేర్కొన్నారు. తక్షణమే మాధవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.