విజయవాడ(చైతన్యరథం): ప్రతి వరద బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు అందించాలని అధికారులను రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. బుధవారం ఆయన విజయవాడలోని కృష్ణలంక, సింగ్ నగర్, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వరద ప్రభావం తగ్గటంతో బాధితులకు ప్రభుత్వం నుంచి త్వరలోనే మెరుగైన సహాయం అందుతుందని, అధికారులు నష్టాన్ని అంచనా వేస్తారని మంత్రి తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగకుండా నివారించ గలిగామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన చర్యలను తీసుకుంటున్నారని తెలిపారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి ఉందని అవసరమైన చోట నీటిని మోటార్లతో బయటకు బయటకు తోడిస్తామని బాధితులకు మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి పార్థసారథి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ బాధితుల వద్దకు వెళ్లి కూరగాయలు, పండ్లు, పాలు, మజ్జిగ, మంచి నీరు, ఆహర పదార్ధాలను అందించారు. సింగ్ నగర్లో పరిస్థితులు క్రమేపి మెరుగుపడుతున్నాయని చెప్పారు. బాధితుల దగ్గరికే మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి సహాయం అందచేస్తారని మంత్రి భరోసా కల్పించారు. ఎవరూ అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం ప్రతి బాధితుడికి అందచస్తామని స్పష్టం చేశారు. బాధితులకు సహాయం అందించటంలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాలు, ప్రజా సంఘాలు బాగా పని చేస్తున్నాయని మంత్రి అన్నారు.
రామలింగేశ్వర నగర్, కృష్ణలంకలోని వరద బాధితుల శిబిరంలో ఏలూరు శాసన సభ్యుడు బి. రాధాకృష్ణ ఏర్పాటు చేసిన దుప్పట్లు, ఆహార పదార్థాను బాధితులకు మంత్రి అందచేశారు.
ఈ కార్యక్రమాల్లో శాసనమండలి సభ్యుడు పి.అశోక్ బాబు, సత్తెనపల్లి శాసన సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ, మాజీ శాసనసభ్యుడు గంటా మురళి, పార్టీ నేతలు బొప్పన భవకుమార్, రొండి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.