- పౌర సరఫరాల శాఖను అప్పుల్లో ముంచేశారు
- రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు ఇవ్వాలి
- పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో ధరల నియంత్రణ
- పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి(చైతన్యరథం): రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణలో సమూల మార్పులు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పౌర సరఫరాల శాఖపై శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని..దీని వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారన్నారు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్ల పాలుచేశారన్నారు.
2019 ముందు వరకు పౌరసరఫరాల శాఖ అప్పులు రూ.21,622 కోట్లు కాగా….5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను రూ.41,550 కోట్లకు తీసుకువెళ్లి ఈ శాఖను నాశనం చేసిందన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ లో కందిపప్పు ధర రూ.180 రూపాయలు ఉంటే….ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150లకు, బియ్యం కూడా కేజీ రూ.48లకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగానే రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని అధికారులకు సీఎం సూచించారు.
గత తెలుగుదేశం హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని, గత వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని, వాటిని మళ్లీ పునరుద్ధరించాలన్నారు. బియ్యం డోర్ డెలివరీ అంటూ చేపట్టిన విధానం కూడా లోపభూయిష్టంగా సాగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని….వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని సీఎంకు అధికారులు వివరించారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ.1,844 కోట్లతో 9,260 వాహనాలు కొనుగోలు చేశారని…అయితే ఆ లక్ష్యం నెరవేరలేదని అధికారులు చెప్పారు. ఈ వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్‌కు వాడుకున్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. వీటి విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై పలు ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.