- ఎన్నికల లబ్ధికి శవ రాజకీయాలు చేసింది జగన్ రెడ్డే
- రాబోయే చంద్రబాబు ప్రభుత్వం రూ.4000 పింఛన్ ఇంటి వద్దే ఇస్తుంది
- ఏప్రిల్ 1 నుండే వర్తింపు స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): ఇళ్లవద్దనే పింఛన్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం చెప్పినా జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వృద్ధులను మండుటెండల్లో సచివాలయాల వద్దకు పలుమార్లు తిప్పించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా దర్శిలో పింఛన్ దారులతో జగన్ రెడ్డి ఆడిరచిన డ్రామా, చెప్పించిన అబద్దాలు న భూతో.. న భవిష్యతి అన్నట్లుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే రూ.3000 పింఛన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక వాయిదాలు పెట్టి ఒక్కో పింఛన్ దారుడికి రూ.32 వేలు జగన్‌రెడ్డి ఎగ్గొట్టారని సోమవారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
అసలు పింఛన్‌ను ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. నాడు ఎన్టీఆర్ రూ.30తో పింఛన్ ప్రారంభిస్తే, చంద్రబాబు తొలుత రూ.75కి, ఆ తర్వాత రూ.200 నుండి రూ.2000కి పెంచారు. ఛార్జీలు, పన్నులు, ధరలు పెంచకుండా చంద్రబాబు రూ.1800 పింఛన్ పెంచారు. టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, ఐదేళ్లలో 21 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చి 2019 నాటికి 54.25 లక్షలకు చేర్చారు. కొత్తగా కిడ్నీ, తలసేమియా రోగులు, హిజ్రాలు, మత్స్యకారులు, కల్లుగీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మ కారులకు పింఛన్లు అమలు చేసి ఆర్థికంగా తోడ్పాటు అందించారు.
జగన్ రెడ్డి ఐదేళ్లలో కొత్తగా పెంచిన లబ్ధిదారులు కేవలం 10 లక్షలు మాత్రమే. ఇలా పింఛన్ల సంఖ్యపై కూడా మభ్యబెట్టి మోసపూరిత రాజకీయం చేస్తూ ప్రజల్ని ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. పింఛన్ దారులపై చిత్తశుద్ధి లేకుండా.. వాలంటీర్లతో రాజకీయం చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి రాదనే విషయం అర్థమై ఆయన ఒత్తిడి చేసినా 97% మంది వాలంటీర్లు రాజీనామా చేయబోమని అడ్డం తిరిగారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా, ఆ విధంగా చర్యలు తీసుకోకుండా, కావాలనే వైసీపీ నేతలతో పింఛన్దార్లతో ర్యాలీలు చేయించారు. వృద్ధులు, దివ్యాంగులను మండుటెండలో రోడ్లపై మంచాలపై, వీల్చైర్లలో తీసుకొచ్చి ఊరేగింపులు చేశారు. వాలంటీర్లు లేకపోతే అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేయలేదనేలా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేయడంతో సచివాలయ సిబ్బందితో రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు.
అదే పని ముందే ఎందుకు చేయలేదు? రూ.13 వేల కోట్ల ప్రభుత్వ నిధులు సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంతో ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వలేదు. 3వ తేదీన అప్పు తెచ్చి 4వ తేదీన పింఛన్లు ప్రారంభించారు. వాలంటీర్లను ఎన్నికల సంఘం ఎందుకు పక్కన పెట్టిందో సమాధానం చెప్పకుండా, తప్పుదోవ పట్టించి ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేయడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి. అనారోగ్యంతో చనిపోయిన వృద్ధురాలితో జగన్ రెడ్డి రాజకీయం చేయబోతే ప్రజలు చీవాట్లు పెట్టి మంత్రి జోగి రమేష్‌ను తరిమికొట్టారు. రాబోయే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పింఛన్‌ను పెంచిన మొత్తంతో కలిపి జులైలో రూ.7000 ఇంటి వద్దనే అందించబోతున్నారు. జగన్ రెడ్డి మొసలి కన్నీరు, అబద్దపు ప్రచారాలను పింఛన్ దారులు నమ్మనందునే వైసీపీ శవ రాజకీయాలను తిప్పికొట్టారు. జగన్ రెడ్డి శవ రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.