- సబ్ కలెక్టర్ ఆదేశాలనూ పట్టించుకోని రెవెన్యూ అధికారులు
- న్యాయం చేయాలని బాధితుల వినతి
- పలు సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు
- అర్జీలు స్వీకరించిన నేతలు డేగల ప్రభాకర్, మాల సురేంద్ర
అమరావతి (చైతన్యరథం): పలు సమస్యలపై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన బాధితులు పార్టీ నేతలకు వినతి పత్రాలు అందించి తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మాల సురేంద్ర.. బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం బుడ్డపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలు విజ్ఞప్తి చేస్తూ.. తమ ఊరిలో పశువుల మేతకోసం వదిలిన భూములను కొందరు కబ్జా చేశారని తెలిపారు. దానిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే.. సబ్ కలెక్టర్ వచ్చి పరిశీలించి ఆక్రమణ నిజమేనని తేలారన్నారు. ఆక్రమణను తొలగించాలని అధికారులను ఆదేశించినా కింది స్థాయిలో రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి పశు మేత భూములను కబ్జా నుండి విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన చిన్న ఈశ్వరయ్య మాదిగ విజ్ఞప్తి చేస్తూ.. తాను పర్మిట్ తీసుకున్న గనిని వైసీపీ నాయకులు కె. సూర్యనాగిరెడ్డి, శివనాగిరెడ్డి కబ్జా చేసి అనుభవిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదన్నారు. దయచేసి అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్ల అగ్రహారానికి చెందిన రాయ రామసుబ్బారెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. మాజీ సైనికోద్యోగినైన తనకు మాజీ సైనికులకు ఇచ్చే ప్రభుత్వ భూమిని ఇప్పిస్తానని చెప్పి మంచాల నరసింహారావు అనే వ్యక్తి దశల వారీగా తన వద్ద రూ. 15 లక్షలు తీసుకొని మోసం చేశాడని అతనిపై చర్యలు తీసుకొని తన డబ్బులు ఇప్పించాలని ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా గొనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన దాసరి బజారి విజ్ఞప్తి చేస్తూ.. గ్రామంలోని మాల చిన్న రంగన్న, మాల పెద్ద రంగన్న, మునగాల శ్రీరాములు, కుంకునూరు జయరాములు అనే వ్యక్తులు తమ భూమిని అక్రమంగా ఆన్ లైన్ చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గ్రామంలో పంచాయతీ పెడితే గ్రామస్థుల ముందు వారు తప్పు ఒప్పుకుని ఆన్‌లైన్‌లో పేర్లను తొలగింపునకు సహకరిస్తామని చెప్పి మళ్లీ నేడు అడ్డుతగులుతున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకొని తమ భూమి తమకు ఆన్‌లైన్ అయ్యేలా చూడాలని దాసరి బజారి విజ్ఞప్తి చేశారు.