- మెగా డీఎస్సీ పోస్టుల భర్తీ కూడా..
- పీఎం కిసాన్ నిధుల విడుదల సమయంలోనే అన్నదాతా సుఖీభవ నిధులు జమ
- ఏప్రిల్ నుంచి మత్స్యకారులకు రూ.20 వేల వేట నిషేధ భృతి
- రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
- అమరావతిలో రూ.2,733 కోట్లతో మరో రెండు పనులకు కూడా
- ప్రత్తిపాడులో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి
- మున్సిపల్ చట్టసవరణకు ఆమోదం
- ప్రధాని పర్యటన విజయవంతానికి కమిటీ
- రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు
అమరావతి (చైతన్యరథం): ఎన్నికల సమయంలో ఇచ్చిన మరికొన్ని హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల పునప్రారంభంలోపు మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
ఎజెండా అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భవనాలు, లేఔట్‌ల అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది. తిరుపతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచేందుకు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు, నంద్యాల, వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
బీమా వైద్య సేవల శాఖ
తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు రూ.7,44,08,373- అంచనా వ్యయంతో అప్-గ్రేడేషన్ చేయడానికి, అదనంగా అవసరమైన (191) మంది వైద్య, పారా మెడికల్ సిబ్బంది మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మొత్తం వ్యయాన్ని 7:1 నిష్పత్తిలో ఇఎస్‌ఐ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి.
పురపాలక, పట్టణాభివృద్ది శాఖ
రాజధాని అమరావతిలో రూ.2,723.02 కోట్ల విలువైన రెండు ఇంజినీరింగ్ పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ అమరావతి అభివృద్ది పనులను నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి రాజధానిని అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో పలు చర్యలు తీసుకుంటోంది. వరల్డు బ్యాంక్, హడ్కో, జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెన్సుతో అమరావతి అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థల సూచనల మేరకు కొత్తగా టెండర్లను పిలిచేందుకు చర్యలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ (ఏపీ ఎంఆర్‌యూడీఏ) చట్టం` 2016కి సవరణలు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్‌మెంట్ లో అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. భవనాలు, లేఔట్‌ల అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు ఉంటుంది.
ప్రణాళికా శాఖ
కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పీఏడీఏ) లో పరిపాలన సజావుగా సాగేందుకు, అభివృద్ధి పనులు మరింత మెరుగ్గా అమలు చేసేందుకు అవసరమైన (19) పోస్టుల మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఇంధన శాఖ
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడిరది. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేశాయి. అయితే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టేందుకు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో 1.0 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా తయారీ సామర్థ్యంతో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్ లిమిలెడ్ (ఏఎంజీఏ) ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ఈ ప్రాజక్టుకు ఆమోదం తెలిపింది. స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా సోలార్, విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో 119 మెగావాట్ల పవన, మరియు 130 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ పవర్, బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం.
కాకినాడలో జాన్ కాకెరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 2 గిగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజెన్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు, పెద్ద హులిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా 400 మెగావాట్ల సోలార్ ఇంధన ప్రాజెక్ట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి కాలసిన భూముని టాటా పవర్స్ సమకూర్చుకుంటుంది, ప్రభుత్వ పరంగా ఈ సంస్థకు ఎటువంటి భూమి ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.2 వేల కోట్ల పెట్టు బడులు రాష్ట్రానికి రానున్నాయి. అదే విధంగా 1,380 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి.
దేశంలోని పలు రాష్ట్రాలు కంప్రెస్‌డ్ బయోగ్యాస్ ప్లాంట్లను తమ తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ పై వత్తిడి తెచ్చినప్పటికీ, ఆ సంస్థ మాత్రం మన రాష్ట్రంలోనే దాదాపు 500 యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా లీజు ప్రాతిపదికన వివిధ జిల్లాల్లో మొత్తం 11,000 ఎంటీ సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా రూ.65 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటు 2.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూములను ఎకరానికి రూ.15000 చొప్పున లీజు ప్రాతిపదికన తమ కేటాయించాలని రిలయన్స్ కంపెనీ కోరింది. ప్రభుత్వం కేటాయించే భూములు సరిపోని పక్షంలో రైతుల నుండే ఆ సంస్థ నేరుగా సమకూర్చుకుని, ఎకరానికి రూ.30 వేలు లీజు చెల్లించేందుకు సిద్దంగా ఉంది. 800 యూనిట్లకు ప్రతిపాదించినప్పటికీ తొలి దశలో 500 యూనిట్లు ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది.
రెవిన్యూ శాఖ
చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం జంగాలపల్లె గ్రామంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని షరతులకు లోబడి ఐఆర్ బెటాలియన్ స్థాపనకు హోం శాఖకు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిరపాలెం గ్రామంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం 6.35 ఎకరాల భూమిని ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
వైఎస్‌ఆర్ జిల్లా కడప మండలం అక్కయ్యపల్లి గ్రామంలోని సర్వే నెం.37/4లో 2.00 ఎకరాల భూమిని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గతంలో టీడీపీ కార్యాలయానికి మంజూరు చేసిన ఈ భూమిని గత ప్రభుత్వం రద్దు చేసింది. ఆ భూమిని తిరిగి టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పరిశ్రమలు, వాణిజ్యం
రాష్ట్రంలో ప్రాజెక్టుల గ్రౌండిరగ్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్, బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల కోసం ఎస్‌ఐపీబీ చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.1046 వేల కోట్ల పెట్టుబడితో బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,381 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. 70.7 ఎకరాలను మూదు దశల్లో ఎకరానికి రూ.38.37 లక్షల ధరకు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది. బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. అనకాపల్లి జిల్లాలో 106.27 ఎకరాల్లో రూ.1,174 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఎండీఎఫ్ లేదా పర్టికల్ బోర్డు ప్లాంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది.
విశాఖలో 10 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థకు విశాఖలో ఏపిఐఐసికి చెందిన మిలీనియం టవర్స్ ఏ, బి బ్లాకుల్లో 2.08 లక్షల చదరపు అడుగుల ఏరియాను కేటాయించేందుకు మంత్రి మండలి అంగీకరించింది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సంస్థ.. నెల్లూరు జిల్లా రామయ్యపట్నం పోర్టు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దాదాపు 6 వేల ఎకరాలను ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 ఏళ్ల కాల వ్యవధిలో రూ.96 వేల కోట్ల మేర బీపీసీఎల్ పెట్టుబడులు పెడుతుంది. చమురు శుద్ది, పెట్రోకెమికల్స్ రంగంలో అంతర్జాతీయ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్ది సంబందిత రంగాల్లో గ్లోబల్ వేల్యూ చైన్ తో అనుసంధానం చేసి, నాణ్యమైన ఉత్పత్తిని సాధించడమే ప్రభుత్వ ఆశయం.
రెవెన్యూ సదస్సులపై సీఎం సమీక్ష
రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా సమీక్షించారు. దాదాపు 1.00 లక్షకు పైగా పిటిషన్లు ఈ సదస్సుల్లో వచ్చాయి. 22ఎ, ల్యాండ్ సర్వే వివాదాలు, ల్యాండ్ రికార్డులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. రెవెన్యూ సదస్సులు పూర్తయ్యేంత వరకూ వేచి ఉండకుండా, సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం ఉన్న పిటిషన్లను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. క్యాబినెట్ దృష్టికి తీసుకు రావాల్సిన విషయాలు ఉంటే వెంటనే తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు నిబంధనలను సరళతరం చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా ఉంది. అందుకోసం రెవెన్యూ, పరిశ్రమలు, ఆర్థిక, పురపాలక శాఖ మంత్రులతో ఒక రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఆర్థిక ఇబ్బందులున్నా..
గత ప్రభుత్వం అనుసరించిన విధ్వంస విధానాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఘోరంగా మారింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు రూ.40 వేల కోట్ల మేర పెండిరగ్ బిల్లులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఈ ఆరు మాసాల కాలంలో వీటన్నింటినీ చెల్లించుకుంటూ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సామాజిక భద్రతా పింఛన్‌ను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచింది. వికలాంగుల పింఛన్లను కూడా పెంచింది. కొన్ని లక్షల పేదల కడుపులు మూడు పూట్లా నింపే విధంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకాన్ని అమలు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తారు. పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఇచ్చే భృతి కింద గత ప్రభుత్వం కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా దానిని రూ.20 వేలకు పెంచి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో మత్స్యకారులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. మెగా డీఎస్సీ ద్వారా ప్రకటించిన 16,500 పోస్టులను వచ్చే విద్యా సంవత్సరానికల్లా భర్తీ చేస్తారు.
ప్రధాని పర్యటన దిగ్విజయానికి కమిటీ
ఈ నెల 8 వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో ప్రర్యటించనున్న నేపథ్యంలో ఆ పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం కూటమి పార్టీల సమన్వయంతో ఒక పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి జన సమీకరణతో పాటు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రధాన మంత్రి బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. అంతకు ముందు సంపత్ వినాయక దేవాలయం నుండి మీటింగ్ జరిగే ఆంధ్ర విశ్వవిధ్యాలయం వేదిక వరకూ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్‌టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్‌టీపీసీ మూడు దశల్లో రూ.65,370 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. అదే విధంగా కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ.1518 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును తొలి దశలో 2,500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్ల విలువైన బల్కు డ్రగ్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ పార్కులో రూ.11,542 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయి. తద్వారా 54 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు.
ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.