అమరావతి (చైతన్య రథం): ప్రజలనుంచి అందే ఏ ఫిర్యాదులనైనా మొక్కుబడి వ్యవహారంలా కాకుండా.. సంతృప్తికర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి ఈనెల 19 వరకు రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 26 వేల ఫిర్యాదులురాగా.. వాటిలో ఇప్పటివరకు 7 లక్షల 22 వేల ఫిర్యాదులు పరిష్కరించారన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల్లో 6 లక్షల 99 వేలు ఎస్‌ఎల్‌ఏకు లోబడి, 22 వేల 770 ఫిర్యాదులను ఎస్‌ఎల్‌ఏకు ఆవల పరిష్కరించారన్నారు. ఫిర్యాదులను కేవలం రొటీన్ విధానంలో పరిష్కరించడం కాకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి క్వాలిటీ డిస్పోజల్ చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా ఎక్కువ ఫిర్యాదులు వచ్చే శాఖలు పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాలన్నారు. గ్రీవెన్స్ రిడ్రెస్సల్‌పై ఎక్స్‌టర్నల్ ఆడిట్ చేయాలని అంటూ.. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి గ్రీవెన్స్ కనిష్టస్థాయికి చేరాలని సీఎం పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ.. రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 26 వేల ఫిర్యాదులు రాగా వాటిలో 7 లక్షల 22 వేలు పరిష్కరించామని వివరించారు. వాటిలో 5 లక్షల 72 ఫిర్యాదుల ఆడిట్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 2 లక్షల 59 వేల 642 రీసర్వేకు సంబంధించినవి, 2 లక్షల 34 వేల 944 రెవెన్యూ సదస్సులు ద్వారాను, లక్షా 91 వేల 494 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చాయని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు.