- ఐటీడీఏ, ఐసీడీఎస్‌లను ప్రక్షాళన చేస్తామని వెల్లడి
- అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని స్పష్టీకరణ
అమరావతి: మహిళా, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమిస్తున్నామని తెలిపారు. గిరిజన పాఠశాల్లో డ్రాప్ అవుట్లను నివారిస్తామని చెప్పారు. ఐటీడీఏ, ఐసీడీఎస్‌లను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడిరచారు.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం
మంత్రి బాధ్యతల స్వీకరణలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. బాధ్యతల స్వీకరణకు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక్క అధికారి కూడా హాజరు కాలేదు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సైతం రాకపోవడంతో మంత్రి సంధ్యారాణి అవాక్కయ్యారు. తాము రావడం లేదని ఆ శాఖ తరపున ప్రతినిధిని పంపుతున్నట్లు కూడా ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వలేదు. వీరి వైఖరితో మంత్రి నివ్వెరపోయారు. ఒక్క గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, మురళి, తదితర ఉన్నతాధికారులు, కొంతమంది జిల్లా అధికారులు మాత్రమే హాజరయ్యారు. సమాచారలోపం వల్లే రాలేకపోయారని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఒంటిగంటకు మంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ఉదయం 10.30 గంటలకు మీడియాకు సమాచార పౌరసంబంధాల శాఖ సమాచారం ఇచ్చింది. మంత్రుల బాధ్యతల స్వీకరణపై జీఏడీ, ఐ అండ్ పీఆర్‌ల మధ్య సమన్వయం కొరవడిరదని సంబంధిత శాఖ ఉద్యోగులు చెబుతున్నారు