కళాప్రపూర్ణ..అభినవ రాముడు, అల్లరి కృష్ణుడు..
చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపించే ఆరడుగుల అందగాడు
పల్లె జీవన సౌరభాలను వెండితెరపై పలికించినవాడు
జాన పదాలను జనపథంలోకి తెచ్చినవాడు
తెలుగు పలుకులకు తేనె వన్నె ఇచ్చినవాడు
విపత్తువేళలో అండగా నిలిచిన ఆపద్బాంధవుడు
తెలుగు ఆత్మగౌరవ పున:ప్రతిష్ఠాపకుడు
తెలుగు తేజాన్ని దిగంతాల బాట పట్టించినవాడు
తెలుగుదనానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచినవాడు
రాష్ట్ర, దేశ రాజకీయాలను మలుపు తిప్పినవాడు
పేదోళ్లకి కూడు, గూడు ఇచ్చి నీడజూపినవాడు
ఆడబిడ్డలకు అండగా నిలిచినవాడు
సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టినవాడు
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చినవాడు
నేటికీ.. ఎన్నటికీ అన్నగా పిలుచుకునే నందమూరి తారకరాముడు
అన్నా.. నీకు తెలుగుజాతి వందనాలు!!
చరిత్ర సృష్టించేవారు, చారిత్రక అవసరాలు తీర్చే అద్భుత వ్యక్తులు యుగానికొక్కరే పుడతారు. చరిత్ర సృష్టించిన అలాంటి యుగపురుషుడే `నందమూరి తారక రామారావు. దేశ రాజకీయ చరిత్రలో ఎందరో రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ అటు దేశస్థాయిలో, ఇటు రాష్ట్రస్థాయిలో ప్రజలు నేటికీ మరువని, ఎప్పటకీ మరువలేని మహా నాయకుడు ఎన్టీఆరే. సినిమా రంగంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకొని తరాలపై చెరగని ముద్రవేశారు. సాటిలేని మేటి కళాకారుడిగా, అరుదైన రాజకీయ నాయకుడిగా పేరు ప్రతిష్టలు గడిరచడం ఎన్టీఆర్‌కే చెల్లింది. మరణించీ జీవిస్తూ కోట్లాది తెలుగు ప్రజల హృదిలో చిరస్మరణీయంగా నిలిచింది ఎన్టీఆరే. ఆయన తెలుగు జాతి గుండె చప్పుడు. తెలుగు నేల ఉన్నంత వరకూ నిలిచిపోయే మహోన్నత వ్యక్తి, సమ్మోహన శక్తి. ఆయన చరిత్ర అనన్య సామాన్యం, అనితరసాధ్యం. తెలుగుజాతి చరిత్రను తిరగరాసిన ఎన్టీఆర్ జీవితం భావితరాలకు భగవద్గీత. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం తెలుగుజాతి గుండెల్లో జాతీయగీతంలా మార్మోగుతోంది. గత ఏడాది స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంత్యుత్సవాలు భారతదేశానికే పరిమితం కాకుండా అన్ని దేశాల్లో అంబరాన్నంటాయి. ఈ ఏడాది 2024 మే 28న ఎన్టీఆర్ 101వ జయంత్యుత్సవాలు జరుపుకొంటున్నారు. రాజకీయాల్లో ఉన్నది పుష్కరకాలమే అయినా ప్రజల మదిలో చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్ ఖ్యాతిని ఆంగ్ల ప్రసార మాధ్యమాలు సైతం కొనియాడాయి. బ్రిటన్ వారపత్రిక ‘ది ఎకనమిస్ట్’ ప్రత్యేక సంకలనం ‘ద బుక్ ఆఫ్ అబీచ్యువరీస్’లో అన్నగారి జీవిత విశేషాల సమాహారం ముద్రితమైంది. ప్రపంచవ్యాప్తంగా 400మంది జీవిత విశేషాలను దానిలో ముద్రించగా, దక్షిణ భారతావనికి చెందిన ముగ్గురిలో ఎన్టీఆర్ ఒకరుగా నిలవడం తెలుగుజాతికి గర్వకారణం. మహా నటుడిగానే కాదు మహా నేతగా తెలుగు ప్రజల నీరాజనాలందుకున్నారు ఎన్టీఆర్. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందారు. తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా ప్రజల మనసులు కొల్లగొట్టారు. మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎదురులేని రారాజుగా వెలుగొందారు. అందమైన రాముడిగా, కృష్ణుడు పాత్రలనే కాదు.. భీష్ముడు, బృహన్నల్లాంటి విభిన్న పాత్రలు పోషించారు. ఠీవీ, రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడులాంటి ప్రతినాయక పాత్రలూ పోషించి.. ఆయా పాత్రలకు జీవం పోశారు.
దేశంలోనే అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు!
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా, తెలుగు చలన చిత్ర రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ తన 60వ ఏట షష్టి పూర్తి సందర్భంగా తన జీవితాన్ని, తనను ఆదరించి ఇంతటివాడిని చేసిన తెలుగుప్రజల రుణం తీర్చుకొనేందుకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, అప్పటి కాంగ్రెస్ దుష్ట పరిపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి నవమాసాల దశలోనే ఆంధ్రప్రదేశ్ అధికార పీఠాన్ని అధిష్టించి కుటిల రాజకీయాలకు సమాధికట్టారు. నాలుగు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా! అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలుగునేల పులకించింది. ఉప్పొంగి పోయింది. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లంటూ పార్టీ సిద్ధాంతాన్ని స్పష్టంగా ప్రకటించారు ఎన్టీఆర్. తెలుగుగడ్డ మీదనే కాదు.. యాతవ్ భారతదేశంలోనే అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు. తెలుగు నేలను ఎంతోమంది సీఎంలు పరిపాలించారు.కానీ రాజకీయాల్లో, పరిపాలనలోను ఎన్టీఆర్ తనదైన శకాన్ని సృష్టించుకొన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దుర్వ్యవస్థలను రద్దు చేసి విప్లవాత్మక విధానాలను పరిపాలనలో పాదుకోలిపిన సమర్ద ప్రజానాయకుడు. తన పరిపాలన బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి పునాది కావాలని ఆలోచించిన ఆదర్శ నాయకుడు ఎన్టీఆర్. ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ఆర్తులను ఆదుకోవడానికి ఊరూరా తిరిగి జోలెపట్టి ప్రజల నుండి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందించిన సమాజ సేవకుడు. నైతిక విలవలకు ప్రాధాన్యతను పెంచి రాజకీయాలకు నూతన నిర్వచనమిచ్చిన మహిమాన్వితుడు ఎన్టీఆర్.
ఆయన తీసుకొన్న నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలు ఆయనను గొప్ప రాజనీతిజ్ఞుడిగా నిలబెట్టాయి. రాష్ట్రాలకు దక్కవలసిన న్యాయమైన హక్కులు, నిధులు హరించివేసే అధికారం కేంద్రానికి లేదని, కేంద్రం మిధ్య అని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. 1983నుంచి రాజకీయం ఏసీ గదులు దాటి గుడిసెకు చేరింది. ప్రజాసంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనకు అధికారం అంటే విలాసం కాదు, బాధ్యత. క్రమశిక్షణ, క్రమవర్తన, సమయపాలన ఆయన జీవిత సూత్రాలు. అవి ఆయన రాజకీయ జీవితంలో కూడా భాగమయ్యాయి. ముఖ్యమంత్రిగా జీతం తీసుకోనన్నారు. కానీ ప్రభుత్వ నిబంధనలు దానికి ఒప్పుకోవు కాబట్టి నెలకు ఒక్క రూపాయి గౌరవ వేతనంగా తీసుకొనేందుకు అంగీకరించారు. వైభవోపేతమైన నివాసంలో ఉండటానికి ఆయన అంగీకరించలేదు. తన అబిడ్స్ ఇల్లు తనకు చాలన్నారు. ఖరీదైన విలాసమంతమైన కార్లను వద్దన్నారు. అంబాసిడర్ కారు చాలన్నారు. ముఖ్యమంత్రి హోదాకు అనుబంధంగా వచ్చే ఎన్నో విలాసాలను సౌకర్యాలను ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారు.
సంక్షేమ రాజ్య విధాత ఎన్టీఆర్
దేశంలో మొదటిసారి పేదవారి సంక్షేమం గురించి ఆలోచించిన మానవతావాది. సంక్షేమ రాజ్యానికి బలమైన పునాదులువేసి పేదల గుండెల్లో శాశ్వత బంధువుగా నిలిచిపోయిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే.. పాలన, సంస్కరణల్లో కొత్త ఒరవడి తెచ్చి అభివృద్ధిని ముందడుగు వేయించిన దార్శనికుడు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల చొప్పున కోటీ ఇరవై లక్షల కుటుంబాలకు కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చారు. 1983 వరకు వరి అన్నం అనేది కొన్ని వర్గాలకు, ప్రాంతాలకు పరిమితమైన రోజుల్లో రూ.2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి పేదవాడి ఆకలి తీర్చిన పేదల దైవం ఎన్టీఆర్. నాటి కిలో రెండు రూపాయల పథకం నేడు ఆహార భద్రత పథకమైంది. పేదవారి కోసం దేశంలోనే మొదటిసారి నాసిరకంగా నిర్మించే పేదల ఇళ్ల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించి నీడ కల్పించారు ఎన్టీఆర్. సిమెంటు, ఇటుకలతో ఇళ్లుకట్టి బలహీనవర్గాల కాలనీలుగా అభివృద్ధి చేశారు. పక్కాఇళ్ల నిర్మాణ పథకం నేడు దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. పేదలకు సగం ధరకు జనతా వస్త్రాల పంపిణీ కూడా ఆయన హయాంలోనే మొదలైంది. చేనేత సంఘాల దగ్గర బట్టలు సేకరించి ఆప్కోద్వారా సగం ధరకే చీర-ధోవతి పథకం అమలు చేశారు ఎన్టీఆర్. వృద్ధుల, వితంతువుల పెన్షన్లకు శ్రీకారంచుట్టి ఆనాడే 30 రూపాయలు పింఛను అందించారు.
220 గురుకుల పాఠశాలలు ప్రారంభించి పేద విద్యార్థులకు గురుకుల విద్య అందించారు. గురుకుల పాఠశాలలు నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించి ఆదర్శంగా నిలిచారు. బడికి వెళ్లే విద్యార్థులు ఆకలితో ఉండకూడదని మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్ కల్పించి బలహీన వర్గాలకు అధికారాన్ని చేరువ చేసారు. రైతుల వ్యవసాయ విద్యుత్ చార్జీలు భారాన్ని తగ్గించడానికి రూ.50కే హార్స్‌పవర్ విద్యుత్ అందించిన మొదటి సీఎం ఎన్టీఆర్. రైతుల భూమికి శిస్తు ఏమిటి? అని భూమి శిస్తు రద్దు చేశారు. గ్రామీణ ప్రజల వైద్య సౌకర్యాల కల్పనకు మండలస్థాయిలో పీహెచ్‌సీలతోపాటు, 30- 50-100 పడకల ఆసుపత్రులు నిర్మించడంతోపాటు నిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి దేశంలోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు అందించారు. ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం దేశంలోనే తొలిసారి మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. సమాజంలో సగభాగమున్న మహిళల విద్యాభివృద్ధికి శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు. ఉన్నత విద్యా కళాశాలల్లో ఉన్న క్యాపిటేషన్ ఫీజు విధానాన్ని రద్దు చేసి పేదలకు ఉన్నత విద్య అందించారు.
మెట్ట భూములకు సాగునీటి సౌకర్యం కల్పించడంకోసం బోర్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టి 14 వేల బోర్లు తవ్వించిన రైతు బాంధవుడు. పాలనా సంస్కరణల్లో కూడా ఆయన తీసుకొన్న ఎన్నో సంచలన నిర్ణయాలు చిరస్మరణీయంగా నిలిచాయి. ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దుచేసి తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రాన్ని అందించారు. మూడంచెల పంచాయితీరాజ్, స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించడం వంటివి ఎన్టీఆర్ విజయాలే. పరిపాలనలో పారదర్శకతకు, స్వచ్ఛతకు పెద్దపీట వేశారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు అన్నిరంగాల్లో అవకాశం.. ఇలా చెప్పుకొంటూపోతే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కీర్తి కిరీటంలో ఎన్నో కలికి తురాయిలు కనిపిస్తాయి. తాలూకా వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలవద్దకే ప్రభుత్వాన్ని నడిపించి పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన పాలనా ఘనాపాటి ఎన్టీఆర్.
సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత
ఎన్టీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. రాయలసీమలో తెలుగు గంగతో పాటు హంద్రీనీవా, గాలేరు నగరి, శ్రీశైలం కుడి కాలువ, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, వెలుగొండ, తెలంగాణలో శ్రీరాంసాగర్ రెండో దశ, నెట్టెంపాడు, కల్వకుర్తి బీమా ఎత్తిపోతల పథకాలు, ఉత్తరాంధ్రలో వంశధార రెండో దశ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఎన్టీఆర్ కాలంలోనే రూపుదిద్దుకున్నాయి.
వెనుక బడిన వర్గాల్లో రాజకీయ చైతన్యం
తెలుగుదేశం ఏర్పడక ముందు రాజకీయాధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంగా సాగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ నాయకత్వంలో నూతన యువతరం సునామీలా రాజకీయాల్లోకి దూసుకొచ్చింది. పేదలకు, యువతరానికి, విద్యావంతులకు, మహిళలకు, వెనుకబడినవర్గాలకు సీట్లు కేటాయించి రాజకీయాలను సామాన్యుల చెంతకు చేర్చారు. అభ్యర్థుల ఎంపికలో కొత్త ఒరవడిని సృష్టించారు. నిష్కళంక, స్వచ్ఛమైన, యువకులు, మహిళలు, విద్యాధికులకు ప్రాధాన్యమిచ్చారు. మొదటిసారి పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులలో 128మంది గ్రాడ్యుయేట్లు, 28మంది పోష్టు గ్రాడ్యుయేట్లు, 20మంది డాక్టర్లు, 8మంది ఇంజినీర్లు ,47మంది న్యాయవాదులు ఉన్నారు. సగటు వయస్సు 41 ఏళ్ళు మాత్రమే. ఈ విధంగా విద్యావంతులను, యువకులను ప్రోత్సహించి రాజకీయ చైతన్యం తెచ్చారు ఎన్టీఆర్. సమాజంలో వేళ్లూనుకున్న సామాజిక రుగ్మతలను తొలగించడానికి మొట్టమొదటిసారి ప్రయత్నించిన మహా మనిషి ఎన్టీఆర్. 1982లో వెనుకబడిన కులాల అండతోనే తెలుగుదేశం ఆవిర్భవించింది. వెనుకబడిన కులాలకు ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ విధానాల్లో బీసీలకు ప్రయోజనాలు కల్పించారు. స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతులకు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించిన ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన కులాలు రాజకీయాల్లో బలమైన నాయకులుగా ఎదిగారు.
జాతీయస్థాయిలో అన్నీ రాజకీయ పక్షాలనూ ఒక తాటి పైకి..
ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి భారత ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అందించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ విధానాలు అనుసరించడం ఎన్టీఆర్‌తో మొదలైంది. మొదటినుండి స్పష్టమైన సిద్ధాంతాలు, విధానాలు, జాతీయ దృక్పథం, ఉన్నత విలువలు పాటించారు. దేశ సమకాలికుల్లో ఎన్టీఆర్‌వంటి ప్రజా నాయకుడు మరొకరు లేరు. దేశవ్యాప్తంగా రైతులకు పదివేలలోపు రుణాలను రద్దు చేసేందుకు ఉపప్రధాని దేవీలాల్‌ను ఎన్టీఆర్ ఒప్పించారు. అవినీతి అంతానికి లోక్‌పాల్ బిల్లు, ప్రసారభారతి బిల్లు ఆమోదించారు. అంబేద్కర్‌కు భారతరత్న ప్రకటించడం, ఆయన చిత్రపటాన్ని పార్లమెంటరీ హాలులో ఆవిష్కరింప చేయడమేకాక, మహ్మద్ ప్రవక్త జయంతిని జాతీయస్థాయిలో సెలవు దినంగా ప్రకటింపచేశారు. తెలుగు భాషకు నిండు గౌరవం, రైతులకు చేయుత, గ్రామీణాభివృద్ది, గ్రామీణ విద్యుద్దీకరణ, పంచాయితీరాజ్ సంస్థలకు హెచ్చు అధికారాలు, విద్యావిధానంలో మౌలిక మార్పులు, పోలీసుశాఖ ప్రక్షాళన, వైద్య ఆరోగ్య సేవలు, సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం, మహిళాభ్యుదయం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ఎన్నికల సంస్కరణలు, గృహవసతికి ప్రాధాన్యం, సెక్యులర్ విధానం, అంతర్జాతీయ దృక్పధం వంటి కార్యక్రమాలతో కూడిన ప్రణాళికతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాజకీయ, ఆర్ధిక, సామాజిక, విప్లవం మొదలై, విలువలకు అంకురార్పణ జరిగి, పాలనారంగంలో సమూల మార్పులు వచ్చాయి. సంక్షేమం, అభివృద్ధి, పేదరిక నిర్ములన, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి మహోన్నత లక్ష్యాలతో, అద్వితీయమైన, అసాధ్యమైన, అనిర్వచనీయమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన నాయకుడు ఎన్టీఆర్.
తెలుగు పౌరుడు మద్రాసీకాడని, భారతావనికి తెలపడమే కాకుండా తెలుగు జాతి ప్రతిష్టను దిగంతాలకు వ్యాపింప చేసిన దార్శనికుడు ఎన్టీఆర్. భారత దేశ చరిత్ర పుటల్లో ఆచద్రార్కం చెదరని ముద్ర వేసిన మహనీయునికి భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలుగు ప్రజలకే కాదు భారతీయులందరికి గర్వకారణం అవుతుంది. దేశ రాజకీయ చరిత్రలో ఎందరో రాజకీయ నాయకులు తెరమరుగయ్యారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లో మేరునగ శిఖరంలా ఈ నాటికీ కనపడటానికి కారణం ఆయనకు ప్రజల పట్ల వున్న అంకితభావం, పట్టుదల, మొక్కవోని స్థైర్యం, నిష్కలంక రాజకీయమని చెప్పక తప్పదు. తెలుగుగడ్డ మీదనే కాదు, యావత్ భారతదేశంలోనే అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు. చిత్తశుద్ది, నిబద్దత, నిజాయితీవంటి సంకల్పాలతో దీక్షబూని అమూల్యమైన ఆశయాలను తెలుగుజాతికి అందించిన కీర్తి కిరణమైన దివ్యమూర్తి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్‌కు సరిలేరు ఎవ్వరూ. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్బంగా ఘన నివాళి అర్పిద్దాం. ఆయన కీర్తి అజరామరం. ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగు ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం.