- గాంధీ బునకర్ చేనేత వస్త్ర మేళా విజయవంతం
- 14 రోజుల్లో రూ.20 కోట్ల టర్నోవర్
- మంత్రి సవిత వెల్లడి
విజయవాడ(చైతన్యరథం): విజయవాడలో 14 రోజుల పాటు నిర్వహించిన గాంధీ బునకర్ చేనేత మేళా విజయవంతమైందని, ప్రజల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మిగిలిన జిల్లాలోనూ చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ నెల ఏడో తేదీ నుంచి నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మంగళవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 14 రోజుల పాటు నిర్వహించిన చేనేత వస్త్ర మేళా విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా నేతన్నలకే ఆర్థిక మేలు కలగజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు. తమ లక్ష్యం నెరవేరిందన్నారు. 14 రోజుల పాటు రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మేర అమ్మకాలు జరిగాయన్నారు. మొత్తంగా రూ.20 కోట్ల అమ్మకాలు జరగడం ఆనందంగా ఉందన్నారు.
ప్రజల్లో చేనేత వస్త్రాల పట్ల ఆదరణ పెరిగిందన్నారు. ప్రజలంతా నేతన్నలకు అండగా ఉండాలని, వారానికి ఒకరోజు ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ చేనేత మేళాను ప్రారంభించడంతో పాటు భువనమ్మ కోసం రెండు చీరలు కొనుగోలు చేయడంతో వస్త్ర ప్రదర్శనకు విపరీతమైన ప్రచారం లభించిందన్నారు. దీంతో ప్రజలు చేనేత వస్త్రాల కొనుగోలుకు ఆసక్తి చూపారన్నారు. దీనివల్ల వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయన్నారు. మరోసారి సీఎంగా చంద్రబాబు అధికారంలోకి రావడంతో చేనేత పరిశ్రమకు స్వర్ణ యుగం వచ్చిందన్నారు. 2014-19లో చేనేత రంగ అభివృద్ధికి అమలు చేసిన అన్నీ పథకాలను అమలు చేస్తామని మంత్రి వెల్లడిరచారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో చేనేత రంగం పూర్తిగా నిర్వీర్య మైందన్నారు.
ఆకట్టుకున్న చేనేత ఫ్యాషన్ షో
చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో చేనేత, జౌళి శాఖాధికారులు నిర్వహించిన సంప్రదాయమైన చేనేత వస్త్రాలతో యువతీయువకుల ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలతో రూపొందించిన ఫ్రాక్ లు, గౌన్లతో యువతుల ఫ్యాషన్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది. యువతులతో కలిసి మంత్రి సవిత ఫ్యాషన్ వాక్‌లో పాల్గొన్నారు. దీంతో సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
అలరించిన నృత్య రూపకం
డాక్టర్ పద్మజారెడ్డి ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. పద్మజారెడ్డి బృంద సభ్యులను మంత్రి సవిత సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి కె.సునీత, కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పవన్ మూర్తి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సీఈవో వీఆర్ నాయక్, జేడీ కన్నబాబు, చేనేత కార్మికులు, నగర ప్రజలు పాల్గొన్నారు.