అమరావతి: గణనాయకుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్న ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడు మీ సంకల్పాలన్నింటినీ నెరవేర్చాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. వినాయక చవితి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రజలను ఏకంచేసి, వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్పూర్తి. అటువంటి గణేష్ ఉత్సవాలపై అనుమతులపేరుతో ఆంక్షలు విధించడం సరికాదని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
లోకేష్ శుభాకాంక్షలు
వినాయకచవితి సందర్భంగా తెలుగు ప్రజ లందరికీ యువనేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో అందరూ క్షేమంగా ఉండా లని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. తలపెట్టే మంచి పనులకి విఘ్నాలు తొలగి, దిగ్విజయం అయ్యేందుకు వినాయకుడు ఆశీస్సులు అందరికీ తోడవ్వాలని గణనాధుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
బాలకృష్ణ శుభాకాంక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ నటసింహ నందమూరి బాలకృష్ణ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విఘ్నాలను అధిగమించి రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాలు కావాలి. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన, సంక్షేమ రంగాల్లో అగ్రగామి కావాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
నేడు కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, శ్రేణులంతా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఒక ప్రకటనలో విజ్జప్తిచేశారు.