- సర్వత్రా శివనామ స్మరణం
- ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
- కిటకిటలాడిన శ్రీశైలం, కోటప్పకొండ
తెలుగు రాష్ట్రంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునుంచే పలు ప్రాంతాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో సర్వత్రా ఆలయాలు మార్మోగుతున్నాయి. భక్తజనం ఆలయాలకు పోటెత్తారు. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో రాష్ట్రమంతటా సంప్రదాయ, పవిత్ర వాతావరణం అలముకుంది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. “మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువైవున్న పవిత్ర భూమి మన రాష్ట్రం. భక్త సులభుడైన శివుడు ఈ రోజే లింగాకారంలో ఉద్భవించాడన్నది శివపురాణ ప్రతీతి. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. శివార్చన, జాగరణలతో మహా శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను” అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. “భక్తుల పాలిట పెన్నిధి, భోళా శంకరుడైన త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పవిత్రమైన రోజు మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణతో నీలకంఠుడి కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర.. ఓం నమః శివాయ” అని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
ఇదిలావుంటే, పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు పరిసర ప్రాంతాలనుంచి భక్తులు పెద్దఎత్తున కొండకు చేరారు. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో పాటు కోటప్పకొండ ప్రాంతాల్లోని ప్రభలు కొండకు తరలడంతో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం ఏర్పడింది. వినుకొండ రోడ్డులోని పెట్రూవారిపాలెం వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. కోటప్పకొండ వద్ద వాహనాల పార్కింగ్ ప్రదేశం దూరంగా ఉండటంతో భక్తులు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇక `మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలనుంచే దర్శనాలను అనుమతించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకనుంచీ పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని భక్తులు దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పాతాళగంగ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. గంగాధర, నంది మండపం వద్ద కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శివయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తజనంతో శ్రీశైలం రహదారులన్నీ రద్దీగా మారాయి.















