- గంజాయి మత్తులో ఘోరాలు
- మంత్రి సవిత మండిపాటు
- గ్యాంగ్ రేప్ బాధితులకు పరామర్శ
- కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతోందని స్పష్టీకరణ
హిందూపురం (చైతన్యరథం): గత ప్రభుత్వ పాపాలు, వైఫల్యాల కారణంగానే నేడు రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత మండిపడ్డారు. తగ ఐదేళ్లలో రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మార్చారని, ఆ మత్తుకు బానిసలైన నేరస్థులు అనేక దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్లబొమ్మిని పల్లి గ్రామ సమీపంలో ఉపాధి కోసం వలస వచ్చి దుండగుల చేతిలో అత్యాచారానికి గురైన అత్తాకోడళ్లను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి సవితమ్మ ఆదివారం పరామర్శించి దైర్యం చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం మీడియాతో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు, తామంతా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నామన్నారు. అమాయక మహిళలపై అతి దారుణంగా అఘాయిత్యం జరిగింది, గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత ఐదేళ్లలో గంజాయిని ప్రోత్సహించింది ఎవరో అందరికీ తెలుసు. గంజాయి వల్ల యువత పెడదారి పడుతోంది. గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారని మంత్రి సవిత అన్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కు పాదం మోపుతోందని మంత్రి సవిత తెలియచేసారు. అదేవిధంగా ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పోలీస్‌లు నలుగురు నిందితులను పట్టుకున్నారన్నారు. ఘటనలో పాల్గొన్న వారంతా గంజాయికి అలవాటు పడినవారని, అనేక కేసుల్లో నిందితులుగా ఉండి, జైళ్లకు కూడా వెళ్ళొచ్చారని పోలీసుల విచారణలో తెలుస్తోందన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట ఆంజినప్ప, రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ, హిందూపురం పట్టణ అధ్యక్షుడు డీఈ రమేష్, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీతో మాట్లాడి దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు.
ఉపాధి కోసం బళ్లారి నుంచి వచ్చిన ఈ కుటుంబం.. ఒక నిర్మాణం వద్ద వాచ్‌మెన్, ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు దుండగులు కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీకొడుకులపై దాడి చేశారు.