- మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు
- మంత్రి లోకేష్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ
అమరావతి(చైతన్యరథం): ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌సీఎల్ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్ 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు హెచ్‌సీిఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివ శంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ వెల్లడిరచారు. హెచ్ సీఎల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. ఏపీలో విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌సీఎల్ ప్రతినిధులు తెలిపారు. ఫేజ్ 2 లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
ఐటిలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్ , స్కిల్ డెవెలప్మెంట్ లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విస్తరణకు కావాల్సిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రిని కోరారు.
విడతల వారీగా రాయితీలు విడుదల చేస్తాం
మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ… గత టీడీపీ హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడగా, తాను స్వయంగా వెళ్లి హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్ శివ్ నాడార్‌తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు. రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువతకు 4500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని చెప్పారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్థత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయింది. పూర్తి స్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టారు.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది… ైఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. మీ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తాం, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తాం, గత ప్రభుత్వంలో పెండిరగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తాం. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మీరు పనిచేయండి, అందుకు అవసరమైన పూర్తి సహకారం మేము అందిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు.