- పుష్కరాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తా
- సీతానగరం రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్
తాడేపలి(చైతన్యరథం): మంగళగిరిలో చరిత్ర తిరగరాయడానికి తాను వచ్చానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి పట్టణం సీతానగరంలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో నాపై అనేక విధాలుగా దుష్ప్రచారం చేశారు. అప్పుడు మంగళగిరిలో ఓడిపోయినప్పటి నుంచి కసితో పనిచేశా. 29 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా. మంగళగరి ప్రజలకు సేవచేసి వారి మనసు గెలవాలని వచ్చా. ప్రజల మనస్సు గెలుచుకోవడం ద్వారానే నాయకుడు అవుతారని చంద్రబాబునాయుడు చెప్పారు. అందుకే ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలిచా.
మంగళగిరిలోనే పోటీ చేసి టీడీపీ జెండా ఎగురవేస్తానని చంద్రబాబుకు చెప్పా. నాపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దు. నా చుట్టూ మీరు తిరగడం కాదు.. నేనే మీ చుట్టూ తిరుగుతూ.. మీ సమస్యలు పరిష్కరిస్తా. పుష్కరాల సమయంలో సీతానగరంలో ఇళ్లు కోల్పోయిన 280 కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో న్యాయం చేస్తానని లోకేష్ చెప్పారు. సీతానగరం వాసులు తమ సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాలి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి. పట్టాలు అందించాలి. ఉద్యోగాలు కల్పించాలి.
పన్నుల భారం తగ్గించాలి. మత్య్సకార కుటుంబాలను ఆదుకోవాలి. వారికి కమ్యూనిటీ హాల్, కల్యాణమండపం నిర్మించాలి. మత్య్సకారులు, రామకృష్ణ సమితి మధ్య నెలకొన్న భూసమస్యను పరిష్కరించాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ కోతల్లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. కాలువ, కొండ, రైల్వే, చెరువు భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి శాశ్వత భూహక్కు కల్పిస్తాం. పరిశ్రమల ద్వారా స్థానికులకే ఉద్యోగాలు కలిస్తాం, పన్నుల భారం తగ్గిస్తాం. మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.