- వ్యవస్థల వినాశకారి.. సీపం జగన్
- దోపిడీ.. అహంకారం.. విధ్వంసం.. అతని నైజం
- పిచ్చొడి చేతిలో రాయి ప్రమాదకరం
- పవన్ కాలిగోటికి చాలని వ్యక్తి, విమర్శలా?
- జగన్ కుటుంబం గురించి మేంమాట్లాడామా?
- చిరంజీవిని ఇంటికిపిలిచి అవమానిస్తారా?
- జగనాసురుడిని ఎన్నికలలో తరిమికొట్టాలి
- బొటనవేలు కోసుకుని ఢిల్లీలో గళం విప్పింది లక్ష్మి
- ప్రజా సంక్షేమానికి నేను జవాబుదారుని
- ప్రాజెక్టులు పూర్తిచేసి రైతును ఆదుకుంటాం
- కూటమి విజయం లాంఛనమే
- జగ్గంపేట భారీసభలో చంద్రబాబు ఉద్ఘాటన
జగ్గంపేట (చైతన్యరథం): వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామికం.. ఇలా అన్ని వ్యవస్థలను అసమర్థ పాలనతో సర్వనాశనం చేశాడు జగన్. అతనొక వ్యవస్థల వినాశకారి. అతనికి అధికారమివ్వడమంటే.. సైకో చేతికి రాయి ఇవ్వడంలాంటిదే. అదెంత ప్రమాదకరమో ప్రజలు అర్థం చేసుకోవాలి’ అంటూ పాలకపక్షంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. అరాచకవాదిని అడ్డుకోకపోతే రాష్ట్రం మరింత అస్తవ్యస్థమయ్యే ప్రమాదముందని చంద్రబాబు హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగ్గంపేటలో నిర్వహించిన 41వ ప్రజాగళం సభలో వైసీపీ అధినేత జగన్ వైఖరిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ జగన్ వ్యక్తిగత దూషణలకూ తెగబడుతున్న తరుణంలో.. జగన్ వైఖరికి చంద్రబాబు ఘాటైన సమాధానాలిచ్చారు.
అహంకారం తప్ప ఏనాడూ సేవాభావాన్ని ప్రదర్శించని జగన్, సేవానిరతితో సమాజంలో గౌరవభావాన్ని సంపాదించుకున్న చిరంజీవిని ఇంటికి పిలిచి అవమానించాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ చిరంజీవిపై వైసీపీ సకలశాఖల అనధికార మంత్రి సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. నీలిపత్రిక సాక్షి కార్యాలయంలో గుమస్తాగా పనిచేసిన బ్రోకర్ సజ్జలకు పద్మవిభూషణ్ చిరంజీవిని విమర్శించే నైతిక హక్కులేదని దుయ్యబట్టారు. కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్‌పై జగన్ సహా వైసీపీ మూకలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వ్యక్తిగత విమర్శలకు దిగజారుతున్నారంటూ చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. అసెంబ్లీలో సైతం కుటుంబాల్లోని మహిళల గురించి వ్యాఖ్యలు చేసే దౌర్భాగ్య రాజకీయం వైసీపీదంటూ ధ్వజమెత్తారు. మేమెప్పుడైనా మీ కుటుంబాల గురించి మాట్లాడామా? అని జగన్‌ను నిలదీస్తూ, పవన్ కాలిగోటికి జగన్ సరిపోడంటూ చంద్రబాబు ఎత్తిపొడిచారు. దుర్మార్గపు పాలన సాగించి ప్రజలను యాతన పెట్టిన జగన్ `జనం వేవ్‌లో కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు.
సైకోలకు ఎలాంటి భయం ఉండదు..
ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన సవాలక్ష తప్పులను ఎత్తిచూపిస్తూ.. సభకు అశేషంగా హాజరైన ప్రజలచేతే సమాధానం రాబడుతూ, జనంచేత ఛీ కొట్టించారు. ‘40యేళ్ల నా రాజకీయ అనుభవం, సంపాదించుకున్న గౌరవాన్ని చూసి నేనంటే మన్ననగా భయపడేవాళ్లను చూశాను. కాని, జగన్ సైకో. అతనికి భయం తెలీదు. అతని సైకో చేష్టలకు నేనూ బాధితుడినే’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రంలోని వ్యవస్థలు కునారిల్లిపోయాయని, జీవనాడి పోలవరం, రాజధాని అమరావతిని సర్వనాశనం చేశాడన్నారు. న్యాయమూర్తుల ప్రతిష్టపై జులుం ప్రదర్శించేవాళ్లను సీబీఐ కేసుల్లో ఉన్నవాళ్లను పక్కనపెట్టుకుని ఊరేగుతున్న జగన్ వైఖరిపై ప్రజలు పునరాలోచన చేయాలని చంద్రబాబు హితవు పలికారు.
మద్యం షాపుల్లో ఆన్‌లైన్ పేమెంట్ ఎందుకు లేదు?
రాష్ట్రాన్ని సమూలంగా దోచుకున్న జగన్ `పెరుగు, మీడగ తినేసి సంక్షేమం పేరిట నీళ్లమజ్జిగ పంచాడని దుయ్యబట్టారు. మద్య నిషేధం తరువాతగానీ ఓటడగనన్న జగన్ `అధిక ధరలకు నాసిరకం మద్యాన్ని పరవళ్లుతొక్కించి జనం డబ్బు, ఆరోగ్యాన్ని జలగలా పీల్చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపక్క టీ షాపుల్లో సైతం ఆన్‌లైన్ పేమెంట్లు సాగుతున్న రోజుల్లో `లక్షల కోట్లలో సాగే మద్యం వ్యాపారానికి ఆన్‌లైన్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదో ప్రజలు ఆలోచించాలన్నారు.
అబద్ధాల బందిపోటును తరిమికొట్టాలి
రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చిందా? సీపీఎస్ రద్దు చేశాడా? కరెంట్ చార్జీలు తగ్గించాడా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? డీఎస్సీ ఇచ్చాడా? జగన్ పాలనా వైఫల్యాలపై లెక్కలేనన్ని ప్రశ్నలున్నాయి. ఎన్నికల సభల్లో ఏఒక్క దానికైనా సమాధానం చెప్పాడా? చెప్పగలడా? అని చంద్రబాబు నిలదీశారు. బందిపోటు దొంగ ఇంటిమీదికొస్తే ప్రతిఘటిస్తాం. ఊళ్లోకొస్తే తరిమికొడతాం. రాష్ట్రాన్ని సమూలంగా దోచుకున్న బందిపోటు జగన్‌ను తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి గెలుపు లాంఛనమేనని, ప్రభుత్వం ఏర్పాటుకాగానే ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వస్తున్నామని చెబుతూ.. ‘సూపర్’ పథకాలతో ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల ప్రాముఖ్యత, ప్రాధాన్యతను చంద్రబాబు వివరించారు.
సాగు నీటికి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
టీడీపీ, జనసేనలకు సంపద సృష్టించడం తెలుసు. సంపద కొల్లగోట్టే పార్టీ వైసీపీ అని చంద్రబాబు చురకలంటిస్తూ.. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యనిచ్చి రైతులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. యువగళంతో రూ.3వేల నిరుద్యోగ భృతి, 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలిస్తామని యుతవకు హామీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులతో ప్రతినెలా ఇంటిదగ్గరే పింఛన్లు అందిస్తామని, ప్రతి పేదవాడి ఇంటికల నెరవేరుస్తామని బాబు హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తగా అనుభవశాలి నెహ్రూను గెలిపించుకుంటే సత్వర నియోజక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అలాగే దక్షతతో టీటైం వ్యాపారం నిర్వహించి 20వేల మందికి ఉపాధి అవకాశం కల్పించిన ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. పుష్కర, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులను వృద్ధి చేసుకుని, అన్ని ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులు పూర్తి చుసుకుందామన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని చెబుతూనే.. జాబు రావాలంటే కూటమి రావాలన్న నినాదాన్ని చంద్రబాబు ఇచ్చారు.
బొటనవేలు కోసుకుని ఢల్లీిలో గళం విప్పింది లక్ష్మి
రాష్ట్రంలో వేళ్లూనుకున్న అరాచకాన్ని రాష్ట్రపతి, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లేందుకు గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మి వేలు కోసుకుందన్న సమాచారాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఒక మహిళ తన నిరసన తెలియచేడానికి అంతటి సాహసానికి పూనుకుందంటే.. వైసీపీ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడివుంటారోనని చంద్రబాబు అన్నారు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి గాయపర్చుకునే సాహసాలు చేయొద్దని, మే 13న అదే వేలితో ‘జగనాసుర వధ’కు బటన్ నొక్కాలని, కూటమిని తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజాగళం సభకు జనం పోటెత్తడంతో `చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా, ఉద్వేగంగా సాగింది.