అమరావతి (చైతన్యరథం): వైసీపీ నేతల భూకబ్జాలకు బలైపోయిన చేనేత వర్గానికి చెందిన పాల సుబ్బారావు కుటుంబంలో అనాథగా మిగిలిన పెద్ద కుమార్తె నిత్యకు అండగా ఉంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. వైసీపీ ల్యాండ్ మాఫియా అకృత్యాలకు ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో చేనేతవర్గానికి చెందిన సుబ్బారావు కుటుంబం బలైపోయింది. ఆ కుటుంబంలో పెద్దమ్మాయి నిత్య మాత్రమే మిగిలింది. ఆ అమ్మాయికి అండగా నిలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరం గ్రామానికి చేరుకుని నిత్యని పరామర్శించారు. ఈ సందర్భంగా నిత్యని ఫోన్లో యువనేత నారా లోకేష్ పరామర్శించారు. వైసీపీ నేతల భూదాహానికి బలైన మీ కుటుంబాన్ని తిరిగి తీసుకురాలేకపోయినా, నీకు అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సొంత అన్నయ్యలా ఎంత వరకైనా తానే చదివిస్తానని హామీ ఇచ్చారు. అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, తెలుగుదేశం పార్టీలో కుటుంబసభ్యురాలిగా మీ బాగోగులన్నీ చూసుకుంటామని నిత్యకు ధైర్యం చెప్పారు.