అమరావతి(చైతన్యరథం): మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంపై మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం ప్రతినిధులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మట్లాడుతూ యువగళంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలు చేయడం పట్ల లక్షా 10వేల మాజీ సైనిక కుటుంబాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సైనికులకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో.. కూటమి నేతలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారని రుజువయిందన్నారు.
అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. జీవోనెంబర్ 57, 191లను కూడా ప్రభుత్వం అమలు చేసి తమకు మేలు చేయాలన్నారు. జీవో నెంబర్ 357 ప్రకారం ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో 2 శాతం ఉద్యోగాలను మాజీ సైనికులకు కేటాయించినా దాన్ని అమలు చేయటం లేదని.. దాన్ని కూడా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సైనికుల సమస్యలను అసలు పట్టించుకోలేదన్నారు. మాజీ సైనికులకు హక్కుగా వస్తున్న ఉద్యోగాలను తమకు అందేలా చూడాలన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ల్లో 2 శాతం రిజర్వేషన్ను 5 శాతానికి, గ్రూప్ 3, గ్రూప్ 4 లలో 10 శాతానికి పెంచాలని వారు అభ్యర్థించారు. మాజీ సైనికులందరినీ ఓసీలుగానే పరిగణిస్తున్నారని, అన్ని కులాల వారు ఉన్నా ఓసీలుగా పరిగణించడంతో మాజీ సైనికులకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కడం లేదన్నారు.