- జగన్‌పై ధ్వజమెత్తిన జనసేన అధినేత పవన్
- కోట్ల హామీలు ఏమయ్యాయని నిలదీత
- కొబ్బరికి పూర్వవైభవం తెస్తామని హామీ
- రాజకీయ దురంధరుడు బాబు అని ప్రశంస
అంబాజీపేట, పి.గన్నవరం (చైతన్యరథం): ప్రేమసీమగావున్న కోనసీమను జగన్ కలహాల సీమ చేశాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. కోనసీమకు పూర్వ వైభవం తీసుకొస్తామని, జగన్ మాఫియాను ఏపీనుంచి తన్ని తరిమేస్తామన్నారు. డొక్కా సీతమ్మ పుట్టిన నేలను పవిత్రంగా చూస్తామన్నారు. కోనసీమలో క్రాప్ హాలిడే రాకుండా చూసుకుంటామని మాటిచ్చారు. గురువారం కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకే ఎన్డీయే కూటమి ఏర్పడిరదన్నారు. త్రివేణి సంగమంలా తెదేపా, భాజపా, జనసేన పని చేస్తాయన్నారు. కొబ్బరి, వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారన్నారు.
రైతు భరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయని, వాటిని రైతులకు మేలు చేసే విధంగా మారుస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అలాగే, కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తామని ప్రకటించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పవన్ హామీ ఇచ్చారు. కోనసీమకు ఇచ్చిన హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2022 జూలైలో జగన్ ఇక్కడ పర్యటించిన సమయంలో రూ.30 కోట్లు హామీలిచ్చి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్
కొనసీమలో పెద్ద కొడుకుగా ఉండే కొబ్బరి చెట్టు దిగుమతి ఇప్పుడు లేదని పవన్ వేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొబ్బరి పంటను కాపాడుతామన్నారు. గంగా భవానీ కొబ్బరి బొండాలు కోనసీమ రైతులకు అందిస్తామని మాటిచ్చారు. అంబేద్కర్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తామని, తన అన్న చిరంజీవి జనసేన కోసం ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని గుర్తుచేశారు. ఉపాధి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. చిరంజీవి తనకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వటం వల్ల కోట్లాది ప్రజల ముందు నిలబడి మాట్లాడుతున్నానని అన్నారు. చంద్రబాబు రాజకీయ దురంధరుడు అని ప్రశంసిస్తూనే, తనకు పెద్దన్నలాగా వ్యవహారించి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వాలని కోరారు. తమ సొంత డబ్బులు కౌలు రైతులకు ఇచ్చామని గుర్తుచేస్తూ, కోనసీమలో రైలువెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం – బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. జనసేన ఓట్లు టీడీపీ, బీజేపీ అభ్యర్థులకే వేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.