అమరావతి(చైతన్యరథం): చంద్రన్న శపథం నెరవేరింది. గత అసెంబ్లీలో వైసీపీ నీచుల వ్యక్తిగత దూషణలకు తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు..ఈ కౌరవ సభలో ఇక అడుగుపెట్టను… గౌరవ సభగా మార్చి.. సీఎంగానే సభలో అడుగు పెడతానంటూ 2022లో భీషణ శపథం చేశారు. నిండు సభలో చేసిన శపథం ఇప్పుడు నిజమైంది. రాష్ట్రం మొత్తం ఏకరీతిన వీచిన ప్రభంజనంలో కనీవినీ ఎరుగని స్థాయిలో, ఎన్డీఏ కూటమి ఏకపక్ష విజయం దక్కించుకుంది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలకు 136 స్థానాల్లో గెలుపొందింది. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2019లో టీడీపీ తరఫున గెలిచి, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా, వైసీపీలోకి ఫిరాయించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మరికొందరు పశుప్రవృత్తి కలిగిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురై, దానినుండి వచ్చిన ఆగ్రహంతో సభలో నిప్పులు చెరిగారు.
ఇది కౌరవ సభ. మళ్లీ గౌరవ సభ ఏర్పాటయ్యే వరకు.. నేను సీఎంగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టను.. అని శపథం చేసి.. దండం పెట్టి మరీ బయటకువచ్చారు. ఆనాడే టీడీపీ నేతలు.. వైసీపీ పతనం ప్రారంభమైందని సభలో వ్యాఖ్యానించారు. అది ఇప్పుడు కళ్లకు కట్టినట్టు నిజమైంది. ఇలాఉంటే వైసీపీ అధినేత జగన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత లండన్ వెళ్తూ.. ఆశ్చర్యకరమైన పోలింగ్ జరిగిందున, దేశం మొత్తం ఏపీవైపు చూసే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఆయన ఏ కోణంలో చెప్పారో తెలియదు కానీ.. ఇప్పుడు దేశం మొత్తం ఏపీవైపు చూసేలా ప్రజా తీర్పు ఏకపక్షంగా సాగిపోయింది. మహిళలు రాత్రి 9 గంటల వరకు క్యూలైన్లలో వేచి ఉండి మరీ ఓటేశారు. ఫలితంగా కౌరవ సభ పోయి గౌరవ సభ ఏర్పడి చంద్రబాబు తన శపథాన్ని నెరవేర్చుకున్నారు.