అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగించినట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (డబ్ల్యూజేహెచ్జే) పొడిగింపునకు శాఖ ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమో దం తెలిపిందని వివరించారు. ఈ స్కీమ్‌లో జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లయినా పరిమితులు లేకుండా ఈ సదుపాయం ఉంటుందని తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) తరహాలో వైద్య సేవలు పొందవచ్చన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని, అదే విధంగా నిర్ధేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అక్రిడేషన్ పొందిన జర్నలి స్టులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.