- ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఇక్కడినుంచే మొదలు
- కుప్పంలో ప్రతి ఇంటికీ రాయితీతో సోలార్ ఏర్పాటు
- సోలార్ విద్యుత్ ఉత్పత్తితో బిల్లు భారం తగ్గుదల
- ప్రశాంతమైన కుప్పంలో విధ్వంసం సృష్టించారు
- ఇకపై ఎవరు తోక జాడిరచినా కత్తిరిస్తా…
- ‘పీఎం సూర్యఘర్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
- సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి
కుప్పం (చైతన్య రథం): రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పీఎం సూర్యఘర్ కింద కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వందశాతం రాయితీతో సౌర ఫలకలు ఏర్పాటు చేసి.. విద్యుత్ అందించడమే లక్ష్యం. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్స్ అమర్చుతాము. మన ఇంటిపైనే విద్యుదుత్పత్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. మా చిన్నప్పుడు కరెంటు సరిగా ఉండేది కాదు. లాంతర్ల దగ్గర చదువుకునేవాళ్లం. కరెంటు ఎక్కడో ఉత్పత్తి అయ్యేది. దాన్ని మనం వాడుకునేవాళ్లం. కరెంటుపోతే బాధతో తిట్టేవాళ్లం. ఇప్పుడు మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు వారి ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయించాం. నేను సోలార్, విండ్ కరెంటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. వీటితో విద్యుదుత్పత్తి చేస్తే చార్జీలు తగ్గుతాయి. 100 శాతం సోలరైజేషన్ చేసేందుకు అధునాతన కాన్సెప్ట్‌తో ముందుకొచ్చిన ఐఐటీ కాన్పూర్ను అభినందిస్తున్నా’ అన్నారు.
మన ఇంటిపైనే విద్యుత్ తయారీ
సూర్యఘర్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునేందుకు సబ్సిడీ వస్తుంది. ఒక్కో కిలో వాట్‌కు రూ. 30 వేలు చొప్పున రూ. 60 వేలు ఇస్తారు. అయితే రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తికి రూ. లక్షా 10 వేలు ఖర్చవుతుంది. దీనివల్ల నెలకు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీరు 60 యూనిట్లు కరెంటు వాడితే రూ.200 నుంచి 300 బిల్లు కడుతున్నారు. మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకుని మిగిలిన 140 యూనిట్లు గ్రిడ్‌కు ఇవ్వొచ్చు. నాలుగైదు ఏళ్లు మీరు ఉత్పత్తి చేసిన కరెంటును గ్రిడ్‌కు ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితంతో పాటు, ఐదేళ్ల తర్వాత ఆ ప్యానెళ్లు మీ సొంతమవుతాయి. పైగా మీకు ఏడాదికి రూ.5 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఖర్చు లేకుండా ప్యానెల్స్ పెట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. సోలార్‌తో విద్యుదుత్పత్తి వల్ల ఇళ్లకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇవ్వొచ్చు’ అన్నారు.
కాలుష్య కోరల్లో చిక్కుకున్నాం
క్యాన్సర్వంటి వాటికి కాలుష్యమే కారణం. మనం తినే తిండి, పీల్చే గాలి మొత్తం కాలుష్యమే. ఎరువులతో పండిరచిన పంట తిని మనం రోగాలబారిన పడుతున్నాము. పొల్యూషన్ లేకపోతే 100 ఏళ్లు జీవించవచ్చు.. ఇళ్ల చుట్టూ చెత్తాచెదారం వేయడంతో రోగాల బారిన పడుతున్నాము. చెట్లను పెంచాలి. ఆ గాలి పీల్చితే మీ ఆరోగ్యం బాగుంటుంది. మన కుప్పం నియోజకవర్గంలో కొన్నిచోట్ల 1200 అడుగుల లోపల నీరుంది. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జూన్ నాటికి హంద్రినీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి తీసుకొస్తాము. రాబోయే కాలంలో కుప్పం మొత్తం ఎలక్ట్రికల్ సైకిల్స్ రాబోతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల మాదిరి చార్జింగ్ స్టేషన్లు పెడతాం’ అని చంద్రబాబు వివరించారు.
ఐదేళ్లలో కుప్పంలో అరాచకం సృష్టించారు
ప్రశాంతతకు మారుపేరైన కుప్పం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విధ్వంసాలు సృష్టించి, ప్రజలను ఇబ్బందులపాలు చేశారు. ఇష్టానుసారంగా ఎవరైనా తోకలు జాడిస్తే కట్ చేస్తా. కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, నెడ్ క్యాప్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి జి విధ్యాదరి, కడ పిడి వికాస్ మర్మత్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.