- టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన ప్రజలు, కార్యకర్తలు
- వివిధ ప్రాంతాల నుండి వచ్చి సీఎం చంద్రబాబుకు అర్జీలు ఇచ్చిన బాధితులు
- వేల మంది ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన సీఎం
- మూడు గంటలకు పైగా నిలబడి సాధకబాధకాలు తెలుసుకున్న వైనం
- రాజధాని, అన్న క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందజేత
- అమరావతికి గాజులు విరాళంగా ఇచ్చిన వృద్ధురాలు
అమరావతి (చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుండి విముక్తి కల్పించాలని, వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పలువురు బాధితులు కోరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం ప్రజలు, కార్యకర్తల నుండి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి బాధితులు, ప్రజలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వినతుల స్వీకరణకు సీఎం వస్తున్నారన్న సమాచారంతో సుమారు ఐదు వేల మందికిపైగా కార్యాలయానికి చేరుకున్నారు. మూడు గంటలకు పైగా ప్రజల్ని కలిసి వారి సాధకబాధకాలు విన్న సీఎం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు.
రాజధాని, అన్న క్యాంటీన్లకు విరాళాలు
రాజధాని అమరావతి , అన్న క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. కంకిపాడుకు చెందిన రైతు ఎన్.ప్రభాకర్ రావు రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన జి.వీ.మాణిక్యమ్మ అనే వృద్ధురాలు తన చేతికున్న బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందించారు. భగవద్గీత గ్రూపు తరుపున నిర్మల అనే వృద్ధురాలు రూ.3.42 లక్షలు విరాళంగా అందించారు. చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్లపల్లికి చెందిన జీవన్ కుమార్ అనే దివ్యాంగుడు రూ.25 వేలు, చిత్తూరుకు చెందిన వల్లేరు వెంకటేశ్ నాయుడు లక్ష రూపాయలను రాజధానికి విరాళంగా అందించారు. విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన పర్చూరి రాజబాబయ్య, కమల కుమారి అనే వృద్ధులు అన్న క్యాంటీన్ కు రూ.2 లక్షలు విరాళంగా అందించారు. వీరందరికీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.