- నిర్వహణ బాధ్యత ఔట్‌సోర్సింగ్‌కు
- కార్లు, లారీలు, భారీ వాహనాలకు మాత్రం టోల్ వసూలు
- గ్రామాల నుండి మండల కేంద్రాలకు అదీ ఉండదు
- వినూత్నంగా ఆలోచించి ఈ నిర్ణయం
- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో
- ప్రజల అంగీకారంతోనే అమలు
- శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
అమరావతి( చైతన్యరథం) : రహదారుల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగించే యోచన చేస్తున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. కొత్త రహదారులపై టోల్ వసూలు చేస్తారని, అయితే అన్ని వాహనాలకు టోల్ ఉండదన్నారు. కేవలం కార్లు, లారీలు వంటి భారీ వాహనాలకు టోల్ వసూలు చేస్తారని, ఆటో, బైక్, ట్రాక్టర్లకు ఎలాంటి టోల్ ఉండదని చెప్పారు. గ్రామం నుంచి మండల కేంద్రం వరకు ఎలాంటి టోల్ విధించబోరని కేవలం మండల కేంద్రం దాటిని తర్వాత మాత్రమే టోల్ వసూలు చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల ఆమోదంతోనే కొత్త విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నాణ్యమైన రోడ్లు నిర్మిస్తే గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు మారతాయని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిలో ఇదొక భాగమని చెప్పారు. ప్రజలను ఒప్పించిన తర్వాత మాత్రమే కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.
ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయన్నారు. జనవరిలో పండుగల సందర్భంగా రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలనే ఉద్దేశంతో పనులను వేగవంతం చేశామన్నారు. మన దగ్గర డబ్బుల్లేవు.. ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న రోడ్ల నిర్వహణ జాతీయ రహదారుల మాదిరిగా టెండరు పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తున్నామని, రోడ్లు గోతులమయం కావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా భారీ వాహనాలకు టోల్ విధించేలా నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త విధానాన్ని అమలు చేస్తామన్నారు. బలవంతంగా కొత్త విధానాన్ని అమలుచేయడం ఉండదన్నారు. ఈ విధానం బాగుంటుందని సభ్యులంతా భావిస్తే ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విధానానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారో చెప్పాలని సీఎం కోరగా.. ఎక్కువమంది చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ చేతులు ఎత్తారు.