విజయవాడ (చైతన్య రథం): పోలీస్ అమరవీరుల త్యాగాల వల్లనే సమాజం స్వేచ్ఛగా బతుకుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. తెగువను నేర్పుతూ కనిపెంచిన పోలీసుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆమె శాల్యూట్ చేశారు. సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి సమాజం రుణపడి ఉందన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఎదిరించి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన కె.ఎస్.వ్యాస్ , ఉమేష్‌చంద్ర, పరదేశినాయుడు వంటి వారెందరో పోలీస్ వ్యవస్థకే ఆదర్శమన్నారు. పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన వారికి ఈ సందర్భంగా హోంమంత్రి అనిత నివాళులర్పించారు. నవతరానికి ఉత్సాహాన్ని, స్ఫూర్తిని, ప్రేరణను రగిలించడమే పోలీసు అమరవీరుల సంస్మరణ నిర్వహించుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
పోలీసు సంక్షేమం దిశగా అడుగులు
సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే నిదర్శనమన్నారు. టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తామని హోంమంత్రి వెల్లడిరచారు. విజయవాడ కమిషనరేట్ కేంద్రంగా సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక యాప్ తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై సామాన్యులకు తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా యువత.. డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా అవగాహన కలిగించి అప్రమత్తం చేస్తామని హోంమంత్రి అనిత వెల్లడిరచారు.
24/7.. పోలీస్ ఉద్యోగం: డీజీపీ
రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ అక్టోబర్ 21 అత్యంత ప్రాముఖ్యత కలిగిన త్యాగాల దినం. భారత పోలీసుల త్యాగ నిరతిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు అక్టోబర్ 21 అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. పోలీసు ఉద్యోగం అంటే రోజులో కొన్ని గంటలే నిర్వహించటం కాదని, జీవితాన్నే సమాజానికి అంకితం చేయడమన్నారు. అనుక్షణం వెంటాడే ఆపదను గమనిస్తూ అడుగడుగునా వెంటాడే ప్రమాదాలను గమనిస్తూ ఇలా మొత్తంగా సవాళ్లతోనే సహజీవనం చేసేదే పోలీసు ఉద్యోగమని అన్నారు.. సమాజంలో శాంతి, భద్రతలు కాపాడటమే పోలీసు ప్రధమ కర్తవ్యంగా వివరించారు. పోలీసు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలంటే ఎంతో తెగువ, ధృడ సంకల్పం కలిగి ఉండాలన్నారు.. కుటుంబ సంక్షేమంకంటే సమాజ రక్షణకే కట్టుబడి ఉండాలన్నారు. సమాజ శాంతి, సుస్థిరతే మన విధి నిర్వహణకు ప్రతీకలు కావాలని ఉద్బోధించారు. ‘సామాన్య ప్రజల సంతోషమే మన మానసిక వేదికలవ్వాలి. పోలీసుల త్యాగాలు, వారి ఆశయాలు వృధా పోనీయకుండా ఆ బాధ్యతను ముందుకు తీసుకువెళ్లే గురుతర బాధ్యత మనందరిపై ఉంది. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలచి భరోసా ఇస్తోంది’ అని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఐజీ ఇంటెలిజెన్స్ సీహెచ్ శ్రీకాంత్, పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబాలు తదితరలు పాల్గొన్నారు..