- లభ్ధిదారుల గుర్తింపునకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే
- వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాల లక్ష్యం
- మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకే ఇళ్ల నిర్మాణం
- ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం
- వివరాలు వెల్లడిరచిన మంత్రి పార్థసారథిó
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం నాడు గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను, చర్చించిన అంశాలను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార ` పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడిరచారు. ఈ సమీక్షలో రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించారన్నారు.
రానున్న వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాల్లో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకే ఇళ్లను నిర్మించాలని ఆదేశించారని, అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిదన్నారు.
వెంటనే చెల్లింపులు
గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాత పూరితంగా వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదన్నారు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహనిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి, మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అటు వంటి లేవుట్లలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.
2014-19, 2019-24 మధ్య పోల్చితే గృహనిర్మాణ పధకంలో గత ప్రభుత్వ హయాంలో 9 నుండి 10 వేల కోట్ల వరకూ పేదలకు అన్యాయం జరిగిందన్నారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం పేదవారికి ఆర్థిక లాభం అందకుండా చేసిందన్నారు. వేదిక ఏదైనా సరే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ అని గొంతు చించుకునే గత ముఖ్యమంత్రి వారికి కూడా ఎలాంటి అదనపు లబ్ధిలేకుండా చేశారన్నారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం యూనిట్ ఖరీదు రెండున్నర్ర లక్షలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.50 లక్షల నుండి రూ.1.00 లక్షల వరకూ లబ్ధి చేకూర్చిన విషయాన్ని మంత్రి పార్థసారథి గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.4.00 లక్షల యూనిట్ ధరతో వచ్చే ఏడాది మార్చి నుండి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ధిచేకూర్చేందుకు త్వరలోనే సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పి.ఎం.ఏ.వై. పథకం ఆసరాతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చేపట్టిన గృహాల్లో 8 లక్షల గృహాలు పురోగతిలో ఉన్నాయని, వాటి కూడా తమ ప్రభుత్వం పూర్తిచేయనున్నట్లు మంత్రి తెలిపారు. పిఎంఏవై 2.0 ప్రకారం కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. కోర్టు కేసుల్లో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట, సంబంధిత లబ్ధిదారులకు కొత్త పధకంలో ఇళ్ల మంజూరుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.