- గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం
- ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సింది కలెక్టర్లే
- భూ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టండి
- క్లిష్టతరం చేస్తే.. ప్రజలు తిరస్కరిస్తారు
- కలెక్టర్లకు సీపం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): రానున్న ఐదేళ్ల కాలంలో అర్హులందరికీ ఇళ్లందించే సత్సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం తొలిరోజు రెవెన్యూ సమస్యల పరిష్కార మార్గాలపై చంద్రబాబు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు. ఇదివరకే లబ్దిపొందినవారి అభిప్రాయాలను సేకరించి.. వారుకోరిన విధంగా ఇంటి పట్టాలనుకాని, దానికి సంబంధించిన ఆర్థిక వనరులను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు అన్ని విధాలా లబ్ది చేకూర్చే మార్గాలను ఆలోచించాలని కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయికాని, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతకాలికాని, సమస్యలను క్లిష్టతరం చేయొద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
భూమి అనేది ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశమని, దాన్ని క్లిష్టతరం చేసి ప్రజల తిరస్కారానికి గురికావద్దని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ రికార్డులు చాలావరకు సరళంగా ఉండేవని.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, రికార్డులను తారుమారు చేయడంవల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. కేవలం భూసంబంధిత సమస్యలు మాత్రమే 60నుంచి 70శాతం ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఈవిధంగా రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమవ్వడానికి గల కారణాలు ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. త్వరితగతిన భూసమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలవారీగా సంబంధిత కలెక్టర్లు, అధికారులు భూసమస్యలు పరిష్కార ప్రక్రియ ఏవిధంగా చేపడుతున్నారో అడిగి తెలుసుకోవడంతోపాటు భూ సమస్యల పరిష్కారానికి పలు జిల్లాల కలెక్టర్ల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఒక నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించుకుని ఆ వ్యవధిలో వీలైనంత వరకు సమస్యలకు పరిష్కారంచూపే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.