టిడిపి అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం కర్నూలు 43వ వార్డులో పేదలు నివసించే కాలనీలోకి వెళ్లిన లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 43వ వార్డు వాటర్ వర్క్స్ ఎదురుగా గత 30ఏళ్లుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. కూలీపనులు చేసుకుని జీవనం సాగించే మాకు మీ ప్రభుత్వం వచ్చా ఇళ్లు నిర్మించి ఇవ్వండి.
మా గుడిసెలకు పగటిపూట విద్యుత్ ఇవ్వడం లేదు, దీంతో మా బస్తీ వాసులు ఇబ్బంది పడుతున్నాం. మీ ప్రభుత్వం వచ్చాక పగటిపూట కరెంటు సరఫరా చేయాల్సిందిగా కోరుతున్నామని లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం దోచుకోవడానికే జగనన్న ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సెంటుపట్టా పేరుతో రూ.7వేల కోట్లు దోచుకున్నారు. 30లక్షల ఇళ్లు కడతామన్న జగన్… నాలుగేళ్లలో కట్టింది కేవలం 5ఇళ్లు మాత్రమే. 43వ వార్డు బస్తీ వాసులకు పగటిపూట విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటాం. కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం. త్రాగునీరు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.