- గతంలో తన పాలనతో క్లిష్ట పరిస్థితులను మెరుగుపరచిన చంద్రబాబు
- నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా విశిష్ట సేవలు, విజయాలు
- సమస్యల సుడిగుండాన్ని వారసత్వంగా ఇచ్చిన జగన్ రెడ్డి
- ఆర్థిక నిర్వహణ, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సేకరణ ప్రధాన సవాల్
- పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనపై దృష్టి
- నిరుద్యోగ నిర్మూలన, పెట్టుబడుల ఆకర్షణ ప్రాధాన్యతలు
- జగన్ రెడ్డి దుష్ట పాలన సాంప్రదాయానికి తెరదించాల్సిన ఆవశ్యకత
నవ్యాంధ్ర మూడవ ముఖ్యమంత్రిగా బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు అధికార బాధ్యతలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో నవ్యాంధ్ర ఏ మేరకు అధోగతిపాలు అయిందనేది ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. రాష్ట్ర శాసనసభలోని 175 సీట్లల్లో ప్రజలు 164 చోట్ల తెదేపా-బీజేపీ-జనసేన అభ్యర్థులను గెలిపించి జగన్ రెడ్డి పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతను వెల్లడిరచారు. ఎన్నికల్లో 94 శాతం సీట్లను గెలుచుకొని అధికారం చేపట్టటం దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో జరగటం విశేషం. కూటమి ప్రభుత్వం ముందున్న పెను సవాళ్లకు ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అద్దం పట్టిందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
నాడు-చంద్రబాబు బాట
గతంలో చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1995 నుంచి 2004 వరకు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, 2014-19 కాలంలో నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. మొదటిసారిగా 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్ర పరిస్థితికన్నా.. 2004 లో అధికారంలో నుంచి దిగిపోయినప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. పలు సంస్కరణలతో పాలనను గాడిలో పెట్టి సరైన దారిలో నడిపించారు. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతల సమన్వయంతో మంచి ఫలితాలు సాధించారు. మౌలిక వసతులను అభివృద్ధి పరచి పరిశ్రమల స్థాపనకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల లభ్యతకు పెద్ద ఎత్తున దోహదం చేశారు. ఐటి రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేసి బెంగళూరు, కొత్త ఢల్లీి లకు పోటీగా హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దారు. ఈ పదేళ్ల కృషితో తెలుగు యువత ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. ఈ ప్రాభవం నేటికీ కొనసాగుతోంది. ఈ పదేళ్ల కాలంలో విశాఖపట్టణం అభివృద్ధికి పలు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పదేళ్లలో చేపట్టిన సంస్కరణలు, విధానాలు, ప్రాజెక్టుల అమలు, ఆర్థిక నిర్వహణ ఫలితాలు 2004లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా ఉపయోగపడ్డాయని పరిశీలకుల అభిప్రాయం.
2014లో పురిటి కష్టాలతో నవ్యాంధ్ర ఏర్పడిరది. అభివృద్ధి కేంద్రం, ఆశల హరివిల్లు, భారీ ఆదాయ వనరులున్న రాజధాని హైదరాబాద్ నగరాన్ని కోల్పోయి భవిష్యత్తు పట్ల నవ్యాంధ్ర ప్రజలు తీవ్ర అభద్రతా భావనలో ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబును నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల ఆశలు, ఆశయాలు, నమ్మకం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు సంవత్సరాలు నిరంతర కృషితో నవ్యాంధ్రకు దేశ ప్రగతి పటంలో ప్రముఖంగా గుర్తింపు తెచ్చారు.
ప్రపంచ ప్రమాణాలకు దీటుగా అమరావతి రాజధాని నిర్మాణానికి పటిష్ట ప్రణాళికలను అమలు చేసి సత్ఫలితాలను సాధించారు. నవ్యాంధ్రకు నడిబొడ్డున నూతన రాజధాని అతి వేగంగా రూపు దిద్దుకుంటున్న తీరు ప్రజల్లో భవిష్యత్తు పట్ల స్థిరమైన విశ్వాసాన్ని కల్పించింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి 72 శాతం పనులు పూర్తి చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి పథకాలు చేపట్టారు. మౌలిక వసతుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పై దృష్టి కేంద్రీకరించారు. భారీ స్థాయిలో దేశ విదేశీ పెట్టుబడులను రాబట్టి పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, చట్టాలు, నియమ నిబంధనల మేరకు సుపరిపాలన అందించి నవ్యాంధ్రను అనతి కాలంలోనే అగ్ర భాగాన నిలిపారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో పలు జాతీయ సంస్థల నిర్మాణాన్ని అనతి కాలంలోనే చేపట్టి రాష్ట్ర విభజనతో ఆందోళనకు గురైన ప్రజల్లో ఒక నూతన నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని చంద్రబాబు కల్పించగలిగారు.
స్థూలంగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారి ఎన్నికల అనంతరం ఏర్పడిన కొత్త ప్రభుత్వాలకు మెరుగైన పరిస్థితులతో కూడిన రాష్ట్రాన్ని అప్పజెప్పటం చారిత్రాత్మక వాస్తవం. అదే ఆయన బ్రాండ్ ఇమేజ్. అందుకనే గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనతో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను ప్రజలు మరోసారి చంద్రబాబుకు అప్పగించారు.
నేటి విధ్వంసక వారసత్వం
గతంలో తన తరువాత వచ్చిన పాలకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో అనువైన పరిస్థితుల్లో అధికారం అప్పజెబితే.. దీనికి పూర్తి విరుద్ధంగా నిన్న పదవీ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముళ్ల కిరీటాన్ని ధరించాల్సిన పరిస్థితి. అనంత సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని తీరానికి చేర్చడం ఎంతో ప్రయాసతో కూడిన పని అని.. అయినా విజయం సాధించగలిగిన సత్తా అనుభవజ్ఞుడు, సమర్థుడైన చంద్రబాబుకు ఉందని పరిశీలకుల నిశ్చిత అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ రాజకీయ చరిత్రలో ఇంతటి అధ్వాన్న పరిస్థితుల్లో అధికారం చేపట్టిన సంఘటన బహుశ మరొకటి లేదని వారంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించాల్సిన సమస్యలు
1. విద్వేషం, వైషమ్యాలను అధికారిక భాషగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాంప్రదాయానికి తెరదించి చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తితో సుపరిపాలనను తిరిగి ప్రతిష్టించటం
2. పూర్తిగా విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రగతి పథంలో నడిపించటం
3. నిర్వీర్యమైన పాలనా వ్యవస్థల ఉనికిని తిరిగి నిలబెట్టి రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసేలా చూడటం
4. అప్పుల భారంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను కాపాడి ఆర్థిక నిర్వహణను మెరుగుపరచి ప్రజా ధనం సద్వినియోగమయ్యేలా చూడటం
5. సంక్షోభంలో పడిపోయిన పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని గాడిన పెట్టి లబ్ధిదారుల్లో విశ్వాసాన్ని కల్పించటం
6. వివిధ సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణ
7. యువత, రైతన్నలు, మహిళల సాధికారతకు పటిష్టమైన చర్యలు చేపట్టటం
8. దేశ, విదేశీ పెట్టుబడులను భారీ స్థాయిలో రాబట్టి పారిశ్రామిక ప్రగతికి పటిష్టమైన బాటలు వేసి యువతకు అవసరాల మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించటం
9. పదేళ్ల తరువాత కూడా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన దుస్థితిని నివారించటానికి శీఘ్రగతిన అమరావతి పునర్నిర్మాణం చేపట్టటం
10. రాజధాని నిర్మాణంతోపాటు ఇతర భౌగోళిక ప్రాంతాలు, పట్టణాలు, పల్లెల ప్రగతికి తగు చర్యలు చేపట్టటం
11. పోలవరంతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేయటం
12. గత ఐదేళ్లుగా పూర్తి నిర్లక్ష్యానికి గురైన మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చి.. శీఘ్రగతిన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం
13. వివిధ వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించటం
14. గత ఐదేళ్లుగా విచ్చలవిడిగా సాగిన సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేయటం
15. అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని గత ఐదేళ్లుగా పెంచి పోషించిన దుష్ట సంస్కృతికి అడ్డుకట్ట వేయటం
16. గత ఐదేళ్లుగా ధరల పెరుగుదలతో విలవిలలాడిన ప్రజలకు తగు విధంగా ఊరట కల్పించటం
17. పేదరికం నుంచి బయట పడ్డాము అన్న సుస్థిరమైన భావన కల్పించటానికి పటిష్టమైన చర్యలు చేపట్టటం
18. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలను పటిష్టం చేసి మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యితనివ్వటం
19. ప్రజాస్వామ్య పటిష్టతకు, ప్రజలు రాజ్యాంగ ప్రసాదితమైన హక్కులతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు తగు చర్యలు చేపట్టటం
20. పాలన ఎలా ఉండకూడదో.. ముఖ్యమంత్రి నడత ఎలా ఉండరాదో అని స్పష్టంగా చేసి చూపిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శైలికి పూర్తి భిన్నంగా ప్రజారంజక పాలన అందించటం
ఎన్నికల్లో చంద్రబాబుపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కూటమికి భారీ విజయాన్ని అందించిన నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సృష్టించిన సమస్యల సుడిగుండాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవం, పాలనా దక్షతతో అధిగమించి రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మిస్తారని ప్రజలు, పరిశీలకులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.