- ఆ హోదాలేనిదే ప్రజా సమస్యలు చర్చించరా
- అజ్ఞానాన్ని బయటపెట్టుకొంటూ నవ్వులపాలు కావడం అలవాటైపోయింది
- మాజీ సీఎంపై సీ రామచంద్రయ్య విమర్శలు
అమరావతి(చైతన్యరథం): ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఏ విధంగా ఇస్తారని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా లేనిదే ప్రజా సమస్యలపై చర్చించలేరా అని నిలదీశారు. 11 సీట్లు మాత్రమే పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలట.. ఆ హోదా ఉంటేనే ప్రజాసమస్యల్ని సమర్థవంతంగా సభలో విన్పించగలరట.. అని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖలో జగన్ ఓ వింత, అసంబద్ధమైన వాదన చేశారు.
అందులో మొదటిది – జగన్‌ను ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించకుండా.. మంత్రుల తర్వాత ప్రమాణం చేయించడం అప్రజాస్వామికం అట! అసలు జగన్.. తనను తన పార్టీ శాసనసభ్యులు 10 మంది కలిసి నాయకుడిగా ఎన్నుకొన్నట్లు ప్రొటెమ్ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలి కదా? ఆ లేఖ ఇవ్వనప్పుడు జగన్‌ను వైఎస్సార్ సీపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడని ప్రోటెమ్ స్పీకర్ ఎలా గుర్తిస్తారు? జగన్ అధికారికంగా లేఖ ఇవ్వనప్పటికీ.. గతంలో సీఎం పదవి నిర్వహించారు కనుక మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసేందుకు జగన్‌ను పిలిచారు. నిజానికి, ఈ ప్రభుత్వం జగన్‌కు ఇచ్చిన గౌరవం అది అని రామచంద్రయ్య తెలిపారు.
ఇక, రెండోది – ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వడానికి 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన లేదు అని పేర్కొన్నారు. కానీ, 10 శాతం సీట్లు రాకున్నా.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూల్ గానీ, నిబంధన గానీ ఉన్నదా? ఉంటే దానిని ఎందుకు మీరు మీ లేఖలో ఉదహరించలేదని రామచంద్రయ్య ప్రశ్నించారు. మూడవది – స్పీకర్ మిమ్మల్ని దుర్భాషలాడారన్నారు. స్పీకర్ కాక ముందు ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల్ని.. ఆయన స్పీకర్ అయిన తర్వాత చేసినట్లుగా చెప్పటం వాస్తవాల్ని వక్రీకరించినట్లేనని రామచంద్రయ్య తప్పుబట్టారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య నియమాలు పాటించి ఓ బెంచ్ మార్క్ ఏర్పాటు చేసి ఉంటే.. ఇపుడు వాటినే అనుసరించేవాళ్లం. ఆయన ఎన్నడూ ప్రజాస్వామ్య సూత్రాలను పాటించలేదు. రూల్ ఆఫ్ లా అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు. జగన్‌కి నిజంగా ప్రజల సమస్యలను సభలో సమర్థవంతంగా లేవనెత్తాలని ఉంటే.. ఎక్కడ, ఏ విధంగా కూర్చున్నాం.. అన్నది ముఖ్యం కానే కాదు. గతంలో కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్లు ఎటువంటి హోదా లేకున్నా.. సమర్థవంతంగా తమ బాధ్యతల్ని నిర్వహించి.. ఉత్తమ పార్లమెంటేరియన్లుగా గుర్తింపు పొందారు.
బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు?
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో తలపడి ఓడిపోయిన జగన్.. తమ నలుగురు లోక్‌సభ సభ్యులు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలనే నిర్ణయం తీసుకొన్నారు. కారణం చెప్పగలరా? మీరు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండిరటికీ వ్యతిరేకం అయినపుడు తటస్థంగా ఎందుకు ఉండటం లేదు. బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు. ప్రజలకు ఈ విషయమై జగన్ వివరణ ఇవ్వాలి. పార్టీని ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మాదిరిగా నడపడం వల్లనే ఓటమి ఎదురయిందని గుర్తించకుండా.. ఇంకా ఆ పద్ధతిలోనే ముందుకు వెళుతున్నారు. దీనిని అజ్ఞానం అనాలా? దురంహకారం అనాలా.. జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఒక ప్రకటనలో రామచంద్రయ్య డిమాండ్ చేశారు.