శ్రీకాకుళం: రాష్ట్రంలో కరువు విలయతాండ వం చేస్తుంటే ప్రజా ప్రతినిధులకు పట్టదా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి లోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం తీవ్ర దుర్భిక్షంలో అల్లాడుతుంటే వైఎస్సార్ పార్టీ మొక్కుబడిగా 100 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. కానీ రాష్ట్రంలో 400 మండలాలకు పైగా కరువు విలయతాండవం చేస్తోంది. నదుల్లో ఇసుక దోచుకునే జగన్మోహన్ రెడ్డికి పంట పొలాలకు నీళ్లు ఇవ్వడం తెలియదా? జగన్ ప్రభుత్వం ప్రకటించిన 100 కరువు మండలాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక్క మండలం కూడా లేకపోవడం దౌర్భాగ్యం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారా.. పోయారా? ప్రజా ప్రతినిధులతో పాటు అధికార యంత్రాగం కూడా కళ్ళు మూసుకు వ్యవహరిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కాలువ చివరి భూములకు వెంటనే సాగునీరందించి, రైతులను ఆదుకోవాలి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. కరువు సమయంలో రైతులను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడుదే. టీడీపీ హయాంలో కరువు సమయంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులని ఆదుకున్నాం. దోమపోటుకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నాం. జిల్లా రైతులకు హామీ ఇస్తున్నా.. ఇప్పుడు ఈ ప్రభుత్వం కరువు ప్రకటించకపోతే.. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంవత్సరం కరువు సాయం డబ్బులను రైతులకు తప్పకుండా జమ చేస్తాం. జిల్లాలో సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్లు పథకాలకి వెంటనే కరెంటు సరఫరా చేసేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. శనివారం లోగా లిఫ్ట్ ఇరిగేషన్లకు కరెంట్ ఇవ్వకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను హెచ్చరిస్తున్నాం. వెంటనే రైతులని ఆదుకొని లిఫ్ట్ ఇరిగేషన్లకి కరెంటు ఇచ్చే విధంగా చూడాలి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులందరినీ గుర్తుపెట్టుకుంటాం. పొలాలకు నీరు రాక రైతులు ఇబ్బంది పడుతుంటే నీటిపారుదల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు. తక్షణం కాలువల పైకి వెళ్లి నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్. కోట పరిశీలకుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి ), మండల పార్టీ నాయకులు బగాది శేషగిరిరావు, పినకాన అజయకుమార్, జిల్లా నీటి సంఘ అధ్యక్షుడు మల్ల బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు ఉన్నారు.