గోదావరి తీరంలో ఎగసిపడ్డ పసుపు కెరటం
జనసంద్రంగా మారిన రాజమహేంద్రవరం
హోరుగాలి, జోరువానలోనూ కదలని జనం
ప్రాంగణం నిండిపోవటంతో వేలాదిమంది బయటనే నిలిచిన వైనం
క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన మహానాడు
కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై నిలిచిన ట్రాఫిక్
లక్షలమందికి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు
లక్షలాది మందికి రెండురోజులపాటు అల్పాహారం, భోజనం ఏర్పాటు
……..
తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు తెలుగుజాతి సత్తాని చాటింది. నేల ఈనిందా? ఆకాశానికి చిల్లు పడిందా? అన్న రీతిలో పోటెత్తిన జనసందోహంతో రెండు రోజులపాటు జరిగిన మహానాడు ఆదివారం సాయంత్రం బహిరంగసభతో ముగిసింది. నాలుగుదశాబ్దాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఇప్పటివరకు జరిగిన మహానాడులు అన్నింటినీ తలదన్నేలా రాజమహేంద్రవరం మహానాడు చరిత్ర సృష్టించింది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుక సైతం కలసి రావటంతో మహానాడు తెలుగుజాతికే పండుగలా మారింది. ఒక బ్రహ్మోత్సవంలా ప్రారంభమయిన మహానాడు ముగింపు దశకు చేరుకునేటప్పటికి కుంభమేళాను తలపించింది. గోదావరి పరవళ్ళుని మించి తీరంలో జనకేరటం ఎగసిపడింది. రాజమహేంద్రవరం నగరంతో పాటు, అక్కడకు దారితీసే రహదారులన్నీ పసుపుమయం అయ్యాయి.
జాతీయరహదారి జనప్రవాహం తో నిండిపోయింది. మహానాడు సభాప్రాంగణం లక్షలాది జనసందోహంతో నిండిపోయింది. సభప్రాంగణంలో జాగా లేకపోవటంతో బయటనే లక్షలాది మంది నిలిచిపోయారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి సత్తా ఈ మహానాడుతో ప్రస్ఫుటం అయింది. మహానాడు కుంభమేళా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. సభకు హాజరైన ప్రతి ఒక్కరిలోనూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న కసి, పట్టుదల కానవచ్చింది. మహానాడు ఏర్పాట్లు ప్రారంభం అయినానాటినుంచే అధికార పార్టీ వివిధ రూపాలలో అడ్డంకులు సృష్టించటం, కవ్వింపు చర్యలకు పాల్పడటంతో టిడిపి శ్రేణుల్లో పట్టుదల రెట్టింపు అయింది. అదే స్ఫూర్తితో మహానాడుకు పసుపుసైన్యం కదం తొక్కింది. బహిరంగసభ ప్రారంభానికి ముందు హోరు గాలులు వీచి కొన్ని కటౌట్ లు కూలిపోయాయి.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు, పయ్యావుల కేశవ్, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప వంటి వారు వున్న వి ఐపి టెన్త్ పై ఒక కటౌట్ ఒరిగిపోవటంతో ఆ టెన్త్ నెలకూలింది. అయితే అంతకుముందే ఆ టెంట్ లో వున్న వారంతా బయటకు రావటంతో ప్రమాదం తప్పింది. అయితే కొద్దిసేపటికే గాలులు తగ్గి జోరువాన ప్రారంభం అయింది. జోరు వాన కురుస్తున్నప్పటికి సభాప్రాంగణంలో వున్న వారు తడుస్తూనే, కొంతమంది కుర్చీలు తలలపై పెట్టుకొని నాయకుల ప్రసంగాలు విన్నారు. ప్రజానీకంలో నెలకొని వున్న కసి, పట్టుదలకు ఇది నిదర్శనం. మహానాడుకు హాజరైన జనసందోహాన్ని అదుపు చేయటం సాధ్యంకాక పోలీసులు సైతం ఒకదశలో చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. మహానాడు కు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కేటాయించకపోవటంతో పాటు ప్రయివేటు స్కూల్ యాజమాన్యాలనుంచి సైతం బస్సులు ఇవ్వనీయకుండా చేయటంతో కార్యకర్తలలో మరింత పాటుదల పెరిగింది.
ఎక్కువమంది సొంత వాహనాలను ఏర్పాటు చేసుకొని మహానాడు ప్రాంగణానికి తరలివచ్చారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఆయింది. విశాఖ వైపు నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి వరకు, ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు విజయవాడ వరకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. మహానాడుకు హాజరుకావల్సిన వేలాదిమంది ఆ వాహనాలలోనే చిక్కుకుపోయారు. మహానాడుకు హాజరయ్యే వారికి ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా పార్టీ శ్రేణులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాయి. మహానాడులో ఏర్పాట్లను వివిధ విభాగాలుగా విభజించి, ప్రతిదానికి కొంతమంది నాయకులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల పనితీరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చేన్నాయుడు స్వయంగా పర్యవేక్షించారు. వేలాదిమంది టిడిపి కార్యకర్తలు రేయింబవళ్లు కష్టపడి ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండురోజుల పాటు మహానాడుకు హాజరైన వారికి ఆహారం, త్రాగునీరు, మజ్జిగ నిరంతరం అందుబాటులో వుంచారు. లక్షలాదిమందికి ఘుమఘుమలాడే గోదావరి వంటకాల రుచులు రుచిచూపించారు.