- పేదరికం లేని సమాజం కోసమే నేను పనిచేస్తా
- అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీనే
- రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం, మూడు రాజధానులంటూ విధ్వంసం
- రాష్ట్రానికి మంచి జరగాలని చర్చిల్లో ప్రార్థనలు చేయాలి
- టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
- కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత
అమరావతి: మానవ ప్రయత్నానికి దేవుని అశీస్సులు ఉన్నప్పుడే సంకల్పం నెరవేరుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో పేదరికం లేని సమాజం చూడాలనేది తన ఆకాంక్ష అని. దాని కోసమే తాను పనిచేస్తానన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పార్టీ సీనియర్ నేతలు, పార్టీ క్రిస్టియన్ విభాగం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు పవిత్రమైన మేరీమాత దేవాలయానికి వెళ్లడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమస్త మానవాళి రక్షణ కోసం దేవుడు ఏసు మానవ రూపంలో వచ్చారు. ప్రభుత్వం తరుపున సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించే విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నేను సీఎంగా ఉన్న సమయంలో మొదలు పెట్టాను. నేను ఈ రోజు మేరీమాత దేవాలయంలో బైబిల్ చదివాను. ఏ వ్యాఖ్య చూసినా సమాజ హితం కోసమే బోధనలు ఉన్నాయి. శత్రువును కూడా ప్రేమించాలి అని బైబిల్ చెపుతోంది. కానీ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి నేడు ఉంది. క్రిస్టియానిటీ అంటేనే సేవ. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు పెట్టి క్రిస్టియన్ మిషనరీలు సేవ చేస్తున్నాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ లో అన్న ఎన్టీఆర్ చదువుకున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు ఎయిడెడ్ సంస్థలు చేశాయి. ఎయిడెడ్ సంస్థలకు గత ప్రభుత్వాలు గ్రాంట్ ఇచ్చి ప్రోత్సహించాయి. కానీ నేడు ఆ ఆస్తులు కొట్టేసే ప్రయత్నం జరుగుతోంది. ఏడు లక్షల కోట్ల ఎయిడెడ్ ఆస్తుల కోసం కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది తప్పు అని చెపితే వారిపై కేసులు పెడుతున్నారు. గుంటూరు నగరం అనగానే శంకర్ విలాస్ హోటల్ గుర్తు వస్తుంది. రంగనాయకమ్మ అనే ఆమె ఆ హోటల్ పెట్టింది. విశాఖలో జరిగిన ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదంపై ఆమె చిన్న పోస్టు ఫార్వర్డ్ చేసింది. తన అభిప్రాయం చెప్పినందుకు వృద్ధురాలు అయిన ఆమెపై కేసు పెట్టారు. ఆమెను బెదిరించారు. అనేక తప్పుడు కేసులు పెట్టి హోటల్ మూయించారు. దీంతో ఆమె వేరే బిజినెస్ మొదలు పెడితే దాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇక్కడ బతకలేం అని హైదరాబాద్ వెళ్లిపోయింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు బాధ కలుగుతుంది. ప్రజలంతా వీటి గురించి ఆలోచించాలి. సెమీ క్రిస్మస్ లాంటి కార్యక్రమం చేసుకోవడమే కాదు…ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడాలి, ఖండిరచాలని చంద్రబాబు అన్నారు.
వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి
పార్టీలు దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. దీనిపై కేసు పెడితే పోలీసులు కనీసం స్పందించలేదు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా ఉంది అని ప్రశ్నించినందుకు వచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. రాజకీయ పార్టీలపైనే ఇలాంటి దాడులు చేస్తే…ప్రజా సమస్యలపై ఎవరు మాట్లాడుతారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టాయి. రోడ్లు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సమాజ హితం కోసం పనిచేయమని ఏసుప్రభువు కూడా చెప్పారు. ఎన్నికలకు ఇంకా 100 రోజులు మాత్రమే ఉంది. ప్రజలు అంతా ఆలోచించాలి. మనం గళం ఎత్తకపోతే శంకర్ విలాస్ రంగనాయకమ్మ లా అయిపోతాం. రంగానాయకమ్మ అని పేరు ఉన్నందుకు ఆమె పేరు లో కూడా కులం చూశారు. నేను ఎప్పుడూ కులం, మతం అనేది చూడలేదు. హైదరాబాద్ లో ఐటీని అభివృద్ది చేస్తే…ఒక్క కులమే అభివృద్ది చెందిందా? నేను ఒక్క కులం కోసం అభివృద్ది చేశానా? హైదరాబాద్ లో నేను మొదలు పెట్టిన అభివృద్దిని నాటి వైఎస్‌ఆర్ నుంచి నేటి రేవంత్ వరకు కొనసాగిస్తున్నారు. కానీ మన ఏపీలో మాత్రం అమరావతిని నాశనం చేశారు. రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. మూడు రాజధానులు అంటూ విధ్వంసం చేశారని చంద్రబాబు విమర్శించారు.
సమాజం కోసం పనిచేయాలి
గుంటూరు చర్చికి నేను పది కోట్లు ఇస్తే దాన్ని పూర్తి చెయ్యలేదు. కానీ విశాఖలో రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టి నేను పేదల బిడ్డను అంటున్నాడు. అన్నీ చేసి పైన దేవుడు ఉన్నాడు…కింద నేను ఉన్నాను…. మీ బిడ్డను అంటున్నాడు. లోకంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. కానీ సమాజం శాశ్వతం. సమాజం కోసం పనిచేయాలి. క్రైస్తవులు జెరూసలేంకు వెళ్లేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం రూ. 50 వేల ఆర్థిక సాయం చేసింది. గుంటూరులో రెండు ఎకరాల్లో క్రిస్టియన్ భవనం నిర్మాణానికి రూ. 10 కోట్లు ఇచ్చాం. మరో 6 కోట్లు కూడా కేటాయించాం. విజయవాడ చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. శ్మశాన వాటికలకు భూమి కావాలి అంటే…ప్రత్యేక భూసేకరణ కార్యక్రమం చేపట్టాం. క్రిస్మస్ రోజు పేదలు కూడా పండుగ చేసుకోవాలి అని క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. చర్చ్ ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేశాం. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాము. గతంలో టీడీపీ హయాంలో తీసుకువచ్చిన ఈ విధానాన్ని కొనసాగించాలి. జెరూసలేం వెళ్లే వారికి 50 శాతం ఖర్చు ప్రభుత్వాలు భరించాలి అని కోరుతున్నారు. దీన్ని అధికారంలోకి వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ చర్చిల్లో ప్రార్థనలు చేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.