- మద్యం.. ఇసుక విషయంలో స్పష్టంగా ఉన్నా
- క్షేత్రస్థాయిలో పాలసీ అమలు బాధ్యత మీదే…
- బెల్ట్ షాపులపై భారీ పనిష్మెంటివ్వండి…
- మొదటిసారి తప్పునకు రూ.5లక్షల ఫైన్
- తప్పు రిపీట్ చేస్తే పర్మిషన్ క్యాన్సిల్..
- అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి హెచ్చరిక
అమరావతి (చైతన్య రథం): మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని… దాన్ని క్షేత్రస్థాయి వరకు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మద్యం ధరల విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి, మద్యం షాపుల్లో ఎవరైనా ఎమ్మార్పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారు. ఎంఆర్పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటిసారి రూ.5 లక్షలు ఫైన్ వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటిసారి తప్పుచేస్తే రూ.5 లక్షలు అపరాధ రుసుము విధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలన్న సీపం, ఎన్డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) లిక్కర్ రాకుండా చూడాలన్నారు. అదే విధంగా ఐడీ (ఇల్లీసిట్ డిస్టిల్డ్) లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి, ప్రతి షాపులో సీసీ కెమేరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ.. ప్రతి షాపు వద్ద మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలని సూచించారు. అనంతరం ఇసుక లభ్యత, సరఫరా అంశాలపై తాజా పరిస్థితిని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇసుక లభ్యత పెంచాలని, అన్ని రీచ్ల నుంచి ఇసుక సులభంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదంటూ.. ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే మొదటగా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇసుక విషయంలో తప్పులు జరిగితే ముందుగా అధికారులపైనే చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించాల్సిన పనిలేదని అధికారులకు స్పష్టం ఆదేశాలిచ్చారు.