అకారణంగా రజనీకాంత్ పై విమర్శలే అందుకు నిదర్శనం
చంద్రబాబుపై తన అభిప్రాయం మారదన్న రజనీకాంత్
సంయమనం పాటించాలని అభిమాన సంఘాలకు సూచన
ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించనని చంద్రబాబుతో ఫోన్ సంభాషణలో స్పష్టం చేసిన రజనీకాంత్
అధికార పార్టీకి రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది. కేవలం చంద్రబాబును పొగిడారు అనే ఓకే ఒక కారణంతో వైసీపీ నాయకులు రజనీకాంత్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరైనా విమర్శకు స్పందించటం సహజం. తమపై విమర్శ చేసిన వారికి ప్రతి విమర్శలో సమాధానం చెబుతుంటారు. అయితే రజనీకాంత్ విషయంలో వైసీపీ నాయకులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పల్లెత్తు మాట అనకపోయినా రజనీకాంత్ పై తీవ్ర స్థాయిలో వైసీపీ నాయకులు విరుచుకు పడటం చూస్తే, చంద్రబాబు ను ఎవరైనా పొగిడినా, వారు జీర్ణించుకోలేక పోతున్నారన్న విషయం అవగతం అవుతున్నది.
వైసీపీ లో పెరుగుతున్న అసహనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?రజనీకాంత్ పై విమర్శలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిస్థితి చేయిదాటకూడదనే ఉద్దేశంతోనే రజనీకాంత్ తన అభిమానులకు ఆ విమర్శలు పట్టించుకోవద్దు అని పిలుపునిచ్చారు.
వైసీపీ నాయకులు నాపై చేస్తున్న విమర్శలు పట్టించుకోవద్దు. అభిమాన సంఘాలు సంయమనం పాటించాలి అని సూపర్ స్టార్ రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు తో జరిగిన ఫోన్ సంభాషణలో రజనీకాంత్ వెల్లడించినట్టు సమాచారం. రజనీకాంత్ పై వైసీపీ నాయకుల విమర్శలను చంద్రబాబు తో పాటు టిడిపి నాయకులు ఖండించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, రజనీకాంత్ ల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రజనీకాంత్ తన ప్రసంగంలో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు. చంద్రబాబు విజనరీ.
ఆయన గొప్పతనం ఇక్కడ వున్నవారి కంటే దేశవిదేశాలలో వున్న వారికే ఎక్కువ తెలుసు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అవుతుంది అంటూ రజనీకాంత్ ప్రశంసించారు. దీనిపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. వైసీపీని ఉద్దేశించి రజనీకాంత్ పల్లెత్తు మాట అనకపోయినా విమర్శలు వెల్లువెత్తటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమయింది. రజనీకాంత్ ను వైసీపీ నాయకులు పనిగట్టుకొని ఎందుకు తిడుతున్నారన్న ప్రశ్న ఉత్పన్నం అయింది. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు చేసిన విమర్శలు పట్టించుకోవద్దు అని రజనీకాంత్ తో జరిగిన ఫోన్ సంభాషణలో కోరారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను స్పందించనని రజనీకాంత్, చంద్రబాబుతో చెప్పారు. తాను వున్న విషయాలే చెప్పానని, తన అభిప్రాయం మారేది లేదని అని రజనీకాంత్ స్పష్టం చేశారు.