అమరావతి (చైతన్యరథం): అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూడీఏ)ల పరిధిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన భూమిని గుర్తించాలని అధికారులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ ఆదేశించారు. కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల అధికారులు, చైర్మన్లతో మంత్రి నారాయణ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా యూడీఏల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. అర్బన్ అథారిటీల ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం, లే అవుట్లను అభివృద్ధి చేసి అమ్మకాలు చేయడం ద్వారా ఆర్థికంగా పురోగతి సాధించాలన్నారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో మిడిల్ ఇన్‌కం గ్రూప్, హై ఇన్‌కం గ్రూప్ ఇళ్లను నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన భూమిని గుర్తించాలని ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్థలం ఎంపిక పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. యూడీఏలకు నోడల్ అధికారిగా పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. యూడీఏలకు ఆదాయం వచ్చేలా టూరిజం ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, డైరెక్టర్ హరినారాయణన్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, ఈఎన్‌సీ మరియన్న, మూడు యూడీఏల వీసీలు, మున్సిపల్ కమిషనర్లు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఎయిమ్స్‌లో వాటర్ ప్లాంట్ల పనుల పరిశీలన
మంగళగిరి ఎయిమ్స్ సిబ్బంది, రోగులకు శుద్ధమైన తాగు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకూ తాగు నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. ఇతర అవసరాలకు గుంటూరు ఛానెల్, ఆత్మకూరు చెరువు నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. ఎయిమ్స్ ఆవరణలోనే నీటిని శుద్ధి చేసి సరఫరా చేసే ప్లాంట్ల ఏర్పాటు ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో వీటి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగంగా జరిపిస్తోంది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పనులను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం పరిశీలించారు. ప్రతి రోజూ 25 లక్షల లీటర్ల తాగు నీరు అందించేలా 8 కోట్లతో ఫిల్టర్ బెడ్లు, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై, తాగునీటి శుద్ధి జరిగే విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 15 లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని గుంటూరు పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దాసరి శ్రీనివాస్‌ను మంత్రి నారాయణ ఆదేశించారు.