అమరావతి (చైతన్య రథం): వైకాపా హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ రూ.1000 కోట్లు లబ్ధి పొందాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. “హెరిటేజ్ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు. కిలో నెయ్యి రూ.360కి ఎక్కడ దొరికినా అది కల్తీయే. మార్కెట్లో రూ.1000పైన ఉంటే.. రూ.360కి ఇచ్చేది కల్తీకాక మరేంటి? ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్‌కు కో కంపెనీ అనడం విడ్డూరంగా ఉంది. కో కంపెనీ అనేది ఉండదనే విషయం బొత్సకు తెలియదా? ఆధారాలు లేకున్నా.. హెరిటేజ్‌పై సెబీకి ఫిర్యాదు చేశారు” అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మ్యాచ్ చూడడానికి స్టేడియంకు వెళ్లాలా? అని జగన్ అంటున్నారు. టీ20 ప్రపంచకప్‌లో ఇండియా ఫైనలు చేరితే తప్పనిసరిగా వెళ్తా. మ్యాచ్ చూసేందుకు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకూ టికెట్ తీసుకుంటా” అని నారా లోకేశ్ వెటకారం చేశారు. బడ్జెట్‌లో చర్చ కావాలని మండలిలో వైకాపా సభ్యులు అనడం హాస్యాస్పదంగా ఉందని, చర్చ కోరుకున్నవాళ్లు 4 రోజులు సభను ఎందుకు అడ్డుకున్నారని లోకేష్ ప్రశ్నించారు.















