- విధ్వంసక పాలనతో పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలు
- వాహనాలపై దేశంలోనే తక్కువ పన్నులు ఉండేలా చేస్తాం
- మద్యం దుకాణాలను నియంత్రిస్తాం
- మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలో అయిదేళ్ల జగన్ విధ్వంసక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతింది, పారిశ్రామికవేత్తలు భయాందోళనలతో ఉన్నారు, జగన్ మళ్లీ రాడని నమ్మకం కలిగితేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణాయపాలెం ప్రజలతో శుక్రవారం యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మట్టి, ఇసుక, మద్యం ద్వారా లక్షల కోట్లు దోచుకున్నాడు కాబట్టే జగన్ పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడన్నారు. మేం నిప్పులాగా బతికాం, ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ప్రజాప్రభుత్వం వచ్చాక నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి జవాబుదారీగా ఉంటాం. మద్యపాన నిషేధం చేశాక ఓట్లు అడుగుతానన్న జగన్ జె-బ్రాండ్ల మద్యాన్ని తెచ్చి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాలను తగ్గించి మద్య నియంత్రణ చేస్తాం.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తదితర పన్నులతో రవాణా రంగాన్ని నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనాలకు దేశం మొత్తమ్మీద అతితక్కువ పన్నులు ఉండేలా చర్యలు తీసుకుంటాం. రాబోయే అయిదేళ్లలో పద్ధతి ప్రకారం ప్రభుత్వోద్యోగాలన్నీ భర్తీచేస్తాం, పరిశ్రమలను రప్పించడం ద్వారా ప్రైవేటురంగంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అయిదేళ్లలో 30లక్షల ఇళ్లు కడతానన్న జగన్ 3వేల ఇళ్లు కూడా కట్టలేకపోయారు. గత ఎన్నికలపుడు టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా వ్యవహరించాడు. గత ప్రభుత్వం 90 శాతం నిర్మాణం పూర్తిచేయగా, మిగిలిన 10శాతం పూర్తిచేసి ఇవ్వకపోవడంతో అద్దెలు, వడ్డీ భారంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో గృహసముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు అందజేస్తాం.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ శవరాజకీయాలు చేయడం జగన్ కు అలవాటుగా మారింది. 2014లో తండ్రిశవం, 2019లో బాబాయి శవంతో రాజకీయం చేశాడు. ఈసారి పింఛన్లు ఇవ్వకుండా 32మంది వృద్ధులను చంపేసి వారి శవాలతో రాజకీయం చేయాలని ప్రయత్నించాడు. ఏం చేసినా ఇక ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్ పనైపోయింది, ఆయన శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం కావడం ఖాయమని లోకేష్ చెప్పారు.