- అలాంటివారు పద్ధతి మార్చుకోవాలి
- గంజాయిపై టాస్స్‌ఫోర్స్ ఏర్పాటు
- శాంతి,భద్రతలపై రాజీ ఉండదు
- సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి
విశాఖపట్నం: ఏపీ హోం మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనిత సోమవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. వారికి జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే… ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మూలాలున్న పోలీసులు తప్పుకోవాలి, లేదంటే పద్ధతి మార్చుకోవాలన్నారు. ఎవరి మీదా కక్ష సాధించబోం. తప్పు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులను వదిలేది లేదన్నారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కానివ్వబోనని తెలిపారు. అంతకుముందు, సింహాచలం ఆలయంలో హోంమంత్రి అనితకు ప్రోటోకాల్ అనుసరించి పూర్ణకుంభ స్వాగతం లభించింది. ఆలయ గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.
గంజాయిపై టాస్క్‌ఫోర్స్
రాష్ట్రంలో గంజాయి మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మాజీ సీఎం జగన్ గంజాయిని కట్టడి చేయడానికి కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని మంత్రి అనిత మండిపడ్డారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పిన జగన్.. గంజాయి రాజధానిగా మార్చారని విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు కూడా గంజాయిని అమ్ముకుంటున్నారన్నారు. గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గంజాయిని అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాత్రి 8 గంటల తరువాత చీకట్లో గుంపులు గుంపులుగా ఉన్న వారిపై పోలీసుల చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గంజాయి తీసుకున్న వారికి సంబంధించిన సమాచారం ఇస్తే పారితోషికం ప్రకటిస్తామని ప్రకటించారు. గడిచిన 5 సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, పోలీసులకు ఏ అలవెన్స్‌లు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్‌పైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కనీసం పోలీస్ అకాడమీని కూడా ఏర్పాటు చెయ్యలేదని, పోలీస్ వ్యవస్థకు వచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని విమర్శించారు. తాము వైసీపీ వాళ్లపై దాడి చెయ్యాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లమని, కానీ తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని చెప్పారు. లేని దిశ చట్టం కింద ఏర్పాటైన దిశ పోలీస్ స్టేషన్‌ను మహిళా పోలీస్ స్టేషన్‌గా మార్చుతామని తెలిపారు.