- నెం. 1 కావడానికి అన్ని అర్హతలు ఉన్న దేశం భారత్
- నేషన్ ఫస్ట్ అనేది ప్రతిఒక్కరి నినాదం కావాలి
- దేశాన్ని అగ్రపథాన నిలిపేందుకు 10 సూచనలు
- టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
- జాతీయ జెండా ఆవిష్కరించిన అధినేత
- గుంటూరులో చంద్రన్నకు బ్రహ్మరథం
అమరావతి: భారత దేశం రానున్న 25 ఏళ్లకు ప్రత్యేకమైన విజన్‌తో ప్రయాణం చేస్తే ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మారుతుందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశ్వంలో మేటి దేశంగా నిలవడానికి భారత్ కు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి ఇంకా 25 ఏళ్లు ఉందని..ఈ సమయం చాలా కీలకమైనదని అన్నారు. విజన్-2047 రూపొందించుకుని దేశం ప్రయాణం చేస్తే ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలోకి రావడం ఖాయమని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గుంటూరు లోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రాణ త్యాగాలు చేసిన స్వాంతంత్య్ర సమరయోధులను స్మరించుకుని వారికి నివాళులు అర్పించారు. అమృతలూరు మండలం పాంచాళవరం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు కన్నెగంటి సీతారామయ్య దంపతులను చంద్రబాబు సత్కరించారు.
నేషన్ ఫస్ట్ అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి
అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరాలి..ప్రతి ఒక్కరి మదిలో జాతీయ భావం మెదలాలని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి, సర్థార్ పటేల్, నేతాజీ వంటి జాతీయ నేతలను స్మరించుకుందాం. జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్యను ప్రత్యేకంగా స్మరించుకోవాలి. 400 ఏళ్ల క్రితం నాగరికతలో భారత దేశం ఎంతో ముందుండేది.. అప్పట్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ఉంది.. అయితే వలస పాలనలో భారత దేశం తరువాత తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో ఆకలి బాధలు, కరువు కాటకాలతో దేశం అల్లాడిరది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత పరిస్థితి మారింది. నెహ్రూ, పివి, వాజ్ పేయి, మోదీ వంటి వారు దేశాన్ని ముందుకు నడిపించారు. స్వాతంత్య్రం రాక ముందు, వచ్చిన తరవాత దేశం ఎలా ఉంది అనేది చూడాలి…అలాగే సంస్కరణలకు ముందు సంస్కరణ తరువాత అని చూడాలి. నాడు పివి నరసింహారావు తీసుకున్న సంస్కరణలతో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీ పడుతుంది. తరువాత కాలంలో దేశం ప్రబల శక్తిగా మారింది. ప్రతి ఒక్కరు నేషన్ ఫస్ట్ అని ఆలోచించాలి. దాని కోసం పాటుపడాలి. వ్యక్తుల కంటే దేశం మిన్న అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు అన్నారు.
హరిత, క్షీర విప్లవాలతో మారిన దేశ రూపురేఖలు
హరిత విప్లవం, క్షీర విప్లవంతో దేశ గమనమే మారిపోయింది..కరవు కాటకాల నుంచి ప్రపంచానికి ఆహారం పెట్టే దేశంగా భారత్ మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనాకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చే దేశంగా అవతరించింది. కరోనా అన్ని రంగాలను కుదిపేసింది..కానీ అప్పుడు కూడా పని చేసింది రైతులు మాత్రమే అని ఆయన అన్నారు. దేశంలో వచ్చిన అనేక సంస్కరణలతో టిడిపి భాగస్వామిగా ఉంది. దీనికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. విజన్ 2020తో నాడే టిడిపి లక్ష్యాలను నిర్థేశించుకుని పని చేసింది. తెలుగు దేశం ప్రాంతీయ పార్టీ అయినా..జాతీయ పార్టీ గా పనిచేసింది. టెలీ కమ్యూనికేషన్ సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, ఓపెన్ స్కై పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటులో టిడిపి ప్రభుత్వం జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించింది. నేడు మనం తీసుకునే నిర్ణయాలు భావి తరాలపైనా..ప్రజల అభివృద్ది పైనా ప్రభావం చూపుతాయి. మేకిన్ ఇండియాలో రక్షణ రంగ వస్తువుల తయారీలో 35 నుంచి 70 శాతానికి వెళ్లాం…ఇది 100 శాతానికి రావాలి. ఇలాంటి పురోగతి మనకు గర్వకారణమని అన్నారు.
రాబోయే 25ఏళ్లలో ఏంచేయాలో ఇప్పుడే ఆలోచించాలి
రానున్న పాతికేళ్లు ఏమి చెయ్యాలనేది నేడు ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. ప్రత్యేకమైన ప్రణాళికతో, లక్ష్యంతో పని చెయ్యాలని ఆయన సూచించారు. ఇప్పటికీ పేదరికం ఉంది..రైతులు ఆత్మహత్యలు ఉన్నాయి..నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. వీటిపై ఆలోచన చెయ్యాలి. ప్రతి ఒక్కరు నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది అని కాదు..నేను ఏమి ఇచ్చాను అనేది ఆలోచించాలి. అదే సమరయోధులకు ఇచ్చిన నిజమైన నివాళి. రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలి. సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్దం చేసుకోవాలి అని చంద్రబాబు సూచించారు.
విజన్-2047కి చంద్రబాబు సూచనలు
1. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలి.
2. ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి.
3. బలమైన యువశక్తి ఉన్న దేశం ఇండియా. యువకు అవకాశాలు కల్పించాలి.
4. దేశంలో సంపద సృష్టి జరగాలి…ఆ సంపదను పేద ప్రజలకు పంచాలి.
5. రైతుల కోసం ప్రత్యేకమైన పాలసీలు తీసుకురావాలి. 75 ఏళ్ల తరువాత కూడా రైతు ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదు.
6. విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలి.
7. మహిళా సాధికారత కు ప్రణాళికలు అమలు చెయ్యాలి.
8. దేశంలో నదుల అనుసంధానం ప్రారంభం కావాలి. ఎపిలో గోదావరి కృష్ణ నదుల అనుసంధానం చేశాం. కరవు రహిత దేశం కోసం నదుల అనుసంధానం జరగాలి.
9. అవినీతి లేని పాలనను అందించాలి. టెక్నాలజీ ద్వారా అవినీతిని అంతం చెయ్యాలి.
10. ప్రపంచంలో 25 ఏళ్లలో అగ్రదేశంగా భారత్ అవతరించడానికి ప్రణాళికలు రచించాలి. అన్ని అర్హతలు, వనరులు ఉన్న మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం కావాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఒక సంకల్పంతో, ప్రణాళికతో పని చేసి దీన్ని సుసాధ్యం చెయ్యాలని తాను కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.