హైదరాబాద్: ఇప్పటి వరకు రోజుకు 12 గంటలు పనిచేస్తే చాలనుకునేవాడినని, అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడాలంటే ఇకపై రోజుకు 18 గంటలు పనిచేయాల్సి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమర్థుడైన ఆటగాడితో పోటీపడితేనే మనకు గుర్తింపు వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో శనివారం పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం తనకు వచ్చిందన్నారు. గతంలో నేను 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పని చేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు, సహచరులతో చెప్పానన్నారు. తెలంగాణలో త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో వైద్యరంగంలో రాణించిన సంస్థలకు అవకాశం ఇస్తామన్నారు. అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయాల్లో అయినా, సినిమా రంగంలో అయినా ఎన్టీఆర్‌కు సాటి మరెవరూ లేరన్నారు. దేశంలో సంకీర్ణ రాజకీయాలకు పునాది వేసింది ఎన్‌టీఆరే అన్నారు. రూ.2కి కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.