- వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు
- బాధితులను ఆదుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాం
- ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు
- మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు స్పష్టీకరణ
విజయవాడ (చైతన్య రథం): కృష్ణమ్మ ఉగ్ర వరదలో చిక్కుకుని మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్న బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నామన్నారు. అనూహ్య వరదనుంచి ప్రజలను రక్షించేందుకు ఆరు హెలికాప్టర్లు, 30 డ్రోన్లు సాయంతో ఆహార పంపిణీ, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం మానవతా దృక్ఫథంతో పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని, సహాయక చర్యల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడోరోజు వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తూ.. మంగళవారం ఉదయం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.
‘179 సచివాలయవాల పరిధిలో.. ఒక్కో సచివాలయానికి ఒక సీనియర్ అధికారిని నియమించాం. బాధితుల వద్దకు ట్రాక్టర్లు, వ్యాన్లు, ప్రొక్లెయిన్లు, బోట్లు… ఎలా వెళ్లడానికి సాధ్యమైతే ఆవిధంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. 32మంది ఐఏఎస్ అధికారులు విధుల్లో ఉన్నారు. 10 జిల్లాల నుంచి బాధితుల కోసం ఆహారం తెప్పిస్తున్నాం. మూడు పూటలా బాధితులకు ఆహారం అందిస్తున్నాం. చివరి వ్యక్తి వరకూ సాయం అందిస్తాం. నా సర్వశక్తులొడ్డైనా బాధితులను ఆదుకుంటా. రెండు రోజులు ఇబ్బంది పడ్డారు. ఇక ఇబ్బంది పడటానికి అవకాశం ఉండకూడదు. ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వాటిని పాటించకపోతే కఠిన చర్యలకు తీసుకోవడానికి వెనకాడను. ఆహార సరఫరా సమయంలో బాధితులు ఎక్కువగా గుమికూడకుండా ఉంటే మీరుండే ప్రాంతానికే తీసుకొచ్చి అందిస్తాం. ఒక్కో బోటులో నలుగురు సిబ్బంది, ఒక ఆక్టోపస్, ఒక గ్రేహౌండ్ ఉంటారు.
సరిగా పనిచేయని పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా. ప్రజలకు నష్టం జరిగితే ఊరుకునేది లేదు. రెండు రోజులుగా వరద బాధిత ప్రజలు పడుతున్న బాధలు నేను నేరుగా చూశాను. బిడ్డను బతికించుకోవడానికి భార్యను భర్త వదిలి రావాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. వృద్ధులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంట్లోకి నీళ్లతోపాటు పాములు వచ్చి చేరుతున్నాయి. దీంతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి కుటుంబం బాధలో ఉంది. మానవతా దృక్పదంతో పని చేద్దాం. బాధితులు కూడా ఐవీఆర్‌ఎస్ కాల్‌కు సరైన సమాధానమివ్వండి. ఎక్కడ ఆహారం అందలేదో అక్కడికి అధికారులను పంపుతాం. విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. మూడు రోజులుగా వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నా. ఇకనుండి ఎవ్వరు పని చేయకపోయినా కఠిన చర్యలు ఉంటాయి.
మానవతా దృక్పథంతో పనిచేసి ప్రభుత్వ ప్రతిష్ట పెంచుకుందాం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు ఒడ్డి కాపాడాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు. బాధితుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. బాధితులంతా సంయమనం పాటించాలి. అరగంట ఆలస్యమైనా అందరికీ న్యాయం చేస్తాం. రాష్ట్రంలోని ప్రజలకూ పిలుపునిస్తున్నా. సమాజంలో బాధ్యత కలిగిన మనం బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముంది. ఏవిధంగా సాయమందిస్తారో మీ ఇష్టం. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భోజనం అందిస్తారా? నిత్యావసర సరకులు అందిస్తారా? పరామర్శించి ధైర్యం చెప్తారా. ఏదైనా మీ శక్తి మేరకకు చేయండి. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. మేము చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
వారిది చెత్త రాజకీయం..
విపత్కర సమయంలో చెత్త రాజకీయాలు చేయకుండా ప్రజాహితం కోసం పనిచేయాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయి. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. సహాయక చర్యలకు భంగం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న కుట్రలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని సహించేది లేదు’ అన్నారు. మీడియా ప్రతినిధులు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సమంజసం కాదని చంద్రబాబు హితవు పలికారు. పెద్దఎత్తున నీటి ట్యాంకులు తెప్పించి పరిసరాలు శుభ్రం చేస్తామని, మరో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ‘ఐదేళ్లు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. అధికారులు పని చేయడం మానేశారు. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా పంపించాం. జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశాం. సరిగా పని చేయకపోతే ఎవరినీ ఉపేక్షించం. మంత్రులు కూడా సరిగ్గా పనిచేయకపోయినా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.
మానవతా దృక్పథం చూపాల్సిన సమయం..
మన కుటుంబ సభ్యులు ఒకరు చనిపోతే మనం ఎలా బాధపడతామో అధికారులు కూడా ప్రజల బాధల పట్ల అదేవిధంగా ఆలోచించాలని సీఎం సూచించారు. ఎన్నో ఘటనలు చూశాను. అందుకే నాకు బాధ కలిగింది. వర్షం పడి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు కాలేజీలో సమస్య అంటూ మాట్లాడుతున్నారు. సిగ్గున్నవాళ్లెవరైనా ఇలా మాట్లాడతారా.? రాజకీయ ముసుగులో నేరస్తులుగా ఉండేవారు మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లపైనా విచారణ చేస్తాం. బోట్లు తగిలినచోట్ల పిల్లర్ దెబ్బతింది. ఫుడ్ పాయిజన్ చేస్తున్నారు. బాబాయ్‌ని చంపి నారాసుర రక్తచరిత్ర అని నాపై వార్తలు రాసిన వాళ్లపై ఇలాంటి అనుమానులు ఎందుకురావు.? తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దుర్మార్గుల నుండి ప్రజల్ని కాపాడుకుని మనం ముందుకెళ్లాలి. ఏస్థాయిలో తప్పు జరిగినా ఉపేక్షించను. నిన్న, మొన్న కొందరు అధికారులు సరిగా పని చేయలేదు. ప్రజలు కట్టే పన్నుల నుండి జీతాలు తీసుకుంటున్నారని గుర్తుంచుకోవాలి. సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి పరువు పోగొట్టుకోవద్దు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో పనిచేయాలని సీపం చంద్రబాబు సూచించారు.
5 నిమిషాలు షో చేసి వెళ్లారు
నిన్న ఐదు నిమిషాలు జగన్ వచ్చి షో చేశారు. కనీసం ఒక్కరికైనా ఒక పొట్లం ఆహారమైనా అందించారా? ఒక్కరినైనా రక్షించారా.. కనీసం పలకరించారా? రాజకీయ వికృత చేష్టలకు పాల్పడటం ఎంతమాత్రం మంచిది కాదు. అంతర్జాతీయ డ్రగ్ మాఫియా డాన్ ఎస్కో బార్ కూడా జగన్‌లాగే వ్యవహరించేవారు. వీఆర్‌లో పెడితే పని చేయరా… జీతం తీసుకోవడం లేదా? ప్రజలుంటేనే మనం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కొందరు మీనవేషాలు లెక్కిస్తున్నారు. నేను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు సాయం అందించాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు పని చేయడం లేదని బాధితులు చెప్తున్నారు. హుద్‌హుద్ సమయంలో చేసిన సేవలను నాడు ప్రధాని చూసి అభినందించారు. ఈ వరదలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడే ఉండి పని చేస్తున్నాం. మూడు రోజులు బిడ్డకు పాలు అందకపోతే ఏ తల్లిదండ్రులైనా బాధపడతారు. అందుకే మానవతా దృక్పంథంతో పని చేయాలని చెప్తున్నా. రేపటిలోగా సరిగా పని చేయని అధికారులు తీరు మార్చుకోకపోతే ఇక ఆ తర్వాత మీరే చూస్తారు’ అని సీఎం చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.