- పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతూ వేధింపులు
- గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు
- రీ సర్వే మొత్తం లోప భూయిష్టం
- వైసీపీ నేతల కబ్జాలో భూములు
- న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలకు పలువురి వినతి
అమరావతి(చైతన్యరథం): టీడీపీకి అనుకూలంగా ఉన్నానని కక్షగట్టి వైసీపీ పాలనలో తనపై అక్రమంగా రౌడీషీట్ పెట్టించి వారం వారం పోలీసు స్టేషన్‌కు పిలిచి ఇబ్బంది పెట్టారని, తనపై పెట్టిన అక్రమ రౌడీషీట్‌ను తొలగించి తన మానసిక వేదనను తొలగించాలని, లేదంటే తనకు చావే శరణ్యమని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన పూజల కోటేశ్వరరావు టీడీపీ నేతల ముందు అవేదన వ్యక్తం చేశాడు. ఒక మహిళతో వైసీపీ నాయకులు తనపై అక్రమ కేసులు పెట్టించి పోలీసు స్టేషన్‌లకు తిప్పి దారుణంగా కొట్టారని, కోర్టుకు వెళితే అక్రమ కేసులని తేలడంతో వాటిని కొట్టేశారని తెలిపాడు. దీంతో ఒక సామాన్య రైతునైన తనపై రౌడీషీట్ పెట్టి ఇబ్బందులకు గురిచేశారని. తన కష్టాలను తొలగించాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలను కలిసి అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథ్ రెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బాధితుడి నుంచి అర్జీ స్వీకరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, భరోసా కల్పించారు. పెద్దఎత్తున తరలి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించిన టీడీపీ నేతలు.. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలానికి చెందిన టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు అంచుల నరసింహరావు నేతలకు అర్జీ ఇస్తూ.. వైసీపీ పాలనలో మంత్రి అంబటి రాంబాబు అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాలు చేసినందుకు తనపైనే కాకుండా, తన భార్య, కుమారుడిపైనా అక్రమ కేసులు పెట్టారని వాపోయాడు. దాంతో అమెరికా వెళ్లాల్సిన తన కొడుకు భవిష్యత్ దెబ్బతిందని తెలిపాడు. ఛార్జ్ షీట్ వేయని కేసులు తొలగించేందుకు సంతకాలు పెట్టకుండా పోలీసులు తిప్పుతున్నారని నేతల ముందు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.
టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, తమ సొంత మండలంలో తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైసీపీ వారితో కొత్త వర్గం ఏర్పాటు చేసుకుని, టీడీపీని రెండు వర్గాలుగా చీల్చి అటు పార్టీకి, ఇటు తమకు స్థానిక ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. కావలి నియోజకవర్గం దగదర్తి మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు గ్రీవెన్స్ లో నేతల ముందు వాపోయారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితులను గమనించి పార్టీకోసం పనిచేసిన వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వల్ల తన భూమి 3 ఎకరాలు ఉండాల్సింది. 2.68 ఎకరాలుగా చూపిస్తోందని, అన్యాయంగా ఇతరుల పేరుమీదకు భూమిని ఎక్కించారని, తనకు న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం భీమవరప్పాడు గ్రామానికి చెందిన లాకా జయప్రకాష్ గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశాడు.
కడప జిల్లా కొండాపురం మండలం వెంకయ్య కాల్వ గ్రామంలోని హరిజనవాడలో ఉండే గుళ్లోళ్ల సాయిశ్రీ తండ్రి విజ్ఞప్తి చేస్తూ.. తన బిడ్డ బీటెక్ లో 830కి పైగా మార్కులు సాధించి ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయిందని తెలిపాడు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవటంతో కరోనా సమయంలో పడిన విద్యాదీవెన డబ్బులు ఆమె వైద్యఖర్చుల కోసం వాడుకోవడం వలన చదువు ముగిసినా కూతురు ఫీజు కట్టలేకపోయానని పేర్కొన్నాడు. దాంతో ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఉన్న తన కూతురు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తన కూతురుకు వచ్చిన ఉద్యోగ అవకాశం దూరం అయిందని, దయచేసి తన కూతురికి సర్టిఫికెట్లు ఇప్పించి న్యాయం చేయాలని నేతల ముందు కన్నీటి పర్యంతం అయ్యాడు. అర్జీ తీసుకున్న టీడీపీ నేతలు వెంటనే ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌తో మాట్లాడారు. సమస్య పరిష్కరించి విద్యార్థిని సాయిశ్రీకి సాయం చేయాలని కోరారు.
బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామానికి చెందిన శివబ్రహ్మేశ్వరి అర్జీ ఇస్తూ.. తన పాపకు రెండు కిడ్నీలు పనిచేయడంలేదని, కూలీ నాలి చేసుకుని బతికే తమకు పాప కిడ్నీ ఆపరేషన్‌కు రూ. 10 లక్షలు ఖర్చు పెట్టే స్థోమత లేదని తెలిపారు. గత ప్రభుత్వంలో పాప ఆరోగ్యం కోసం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, కిడ్నీ ఆపరేషన్ వెంటనే చేయకుంటే పాప ప్రాణాలకు ముప్పు ఉందని, దాంతో పాప అమ్మమ్మ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, ఆపరేషన్‌కు సాయం చేసి ఆదుకోవాలని నేతల ముందు వాపోయారు.
తన అన్న, వదిన ఇద్దరూ కరోనా సమయంలో మృత్యువాత పడ్డారని, వారికి మూగ,చెవుడు కలిగిన 15 సంవత్సరాల పాప ఉందని, తన అన్నవదినెల నుండి పాపకు రావాల్సిన భూమిని రమణారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నాడని, పాపకు ఆ కొద్దిపాటి స్థలమే ఆస్తి అని ఆక్రమణదారుడి నుండి భూమిని విడిపించి పాపకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం జెజె పేట గ్రామానికి చెందిన పీలం రవీంద్ర వేడుకున్నాడు.
ప్రభుత్వ పాఠశాలల్లో నియమించబోయే కంప్యూటర్ ఆపరేటర్లు, కంప్యూటర్ టీచర్స్ పోస్టులకు.. వయస్సుతో సంబంధం లేకుండా గతంలో పనిచేసిన కంప్యూటర్ ఉపాధ్యాయులమైన తమకు విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కంప్యూటర్ టీచర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంటి శేఖర్, తదితరులు నేతలకు అభ్యర్థించారు.
గుంటూరులోని విద్యుత్ సర్కిల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి విడతల వారీగా తన దగ్గర నుండి రూ. 6,50,000 ల నగదు తీసుకుని తనను మంద కిషోర్ అనే వ్యక్తి మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకుని తన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని ఒక బాధితుడు వేడుకున్నాడు.
ఇసుక కొరత, నిర్మాణ వ్యయం, పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు పడుతున్న సమయంలో.. పూర్వం టీడీఆర్ బాండ్లు కొన్నవారికి న్యాయం చేసి.. నిర్మాణ అనుమతులను సలుభతరం చేసి నిర్మాణ రంగం ఊపందుకునేలా చూడాలని సివిల్ ఇంజనీర్ ఆదర్శ్ విజ్ఞప్తి చేశాడు.
గత ప్రభుత్వం రీ సర్వే పేరిటన 8.11 సెంట్లు ఉండాల్సిన తన భూమిని 7.70 సెంట్లుగా మార్చి పాస్ పుస్తకాలు తీసుకోమంటున్నారని.. దానికి తాము అంగీకరించలేదని.. దయచేసి భూమిని 8.11 సెంట్లుగా చూపించి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని విజయవాడకు చెందిన డాక్టర్ సాయి ప్రమోద్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
నిర్మాణం పూర్తి చేసి ఇల్లు స్వాధీనం చేస్తామని నమ్మించి తన వద్దనుండి రూ. 45 లక్షలు తీసుకుని ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం పూర్తి చేయకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారని, ఆఫీసుకు వెళ్లి అడిగితే కుంటి సాకులు చెబుతున్నారని తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీవీ కాలనీకి చెందిన అడుసుమిల్లి గోపాలకృష్ణ
కుమార్ అనే వ్యక్తి విజయవాడకు చెందిన మాచినేని కోటేశ్వరరావుపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
ధర్మవరానికి చెందిన రంగం ఆంజనేయులు విజ్ఞప్తి చేస్తూ.. చేనేత మగ్గాలు నేస్తూ..వ్యాపారం చేస్తున్న తన నుండి విజయవాడ కృష్ణలంకలో ఉండే కె. సీత, ఆమె కొడుకు నరేంద్రలు రూ. 24,70,000 ల విలువైన పట్టు చీరలు తీసుకుని నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, నగదు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.
రికార్డులు తారుమారు చేసి వైసీపీ నేతలు మద్దాల సుబ్బారావు, అతని కుమారుడు నాగేశ్వరరావుల అనుచరులు తన పొలాన్ని కబ్జా చేసి పొలంలోకి వెళ్లనివ్వడం లేదని.. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదని.. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరుకు చెందిన మాదాల పెంచలయ్య విజ్ఞప్తి చేశాడు.
పింఛన్‌లు, సీఎంఆర్‌ఎఫ్ సాయం, ఆర్థిక సాయం, వరద సాయం కోసం, ఇంకా పలు సమస్యలపై వచ్చిన ప్రజలు గ్రీవెన్స్‌లో నేతలను కలిసి అర్జీలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.